
తిరుమల: తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలను అత్యంత వైభవంగా నిర్వహించేందుకు టీటీడీ అన్ని ఏర్పాట్లను పూర్తి చేస్తోంది. టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు అధ్యక్షతన ఈ నెల 9న తిరుమల అన్నమయ్య భవన్లో జరిగిన పాలక మండలి సమావేశంలో బ్రహ్మోత్సవాల ఏర్పాట్లపై కీలక నిర్ణయాలు తీసుకున్నారు. సెప్టెంబర్ 14న సాయంత్రం 7 గంటలకు అంకురార్పణతో బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానున్నాయి. సెప్టెంబర్ 15న సాయంత్రం 5.30 నుంచి రాత్రి 7 గంటల మధ్య మీన లగ్నంలో ధ్వజారోహణం నిర్వహించనున్నారు. అదే రోజు రాష్ట్ర ప్రభుత్వం తరఫున ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించనున్నారు. రాత్రి 9 గంటలకు జరిగే పెద్దశేష వాహన సేవలో సీఎం పాల్గొంటారు. సెప్టెంబర్ 16న రిలయన్స్ సంస్థ టీటీడీకి విరాళంగా అందించిన 25 ఎలక్ట్రిక్ బస్సులను చంద్రబాబు ప్రారంభించనున్నారు. అదే రోజు 2027 టీటీడీ క్యాలెండర్లు, డైరీలను ఆవిష్కరించనున్నారు.

భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని ప్రతిరోజూ 10 లక్షల లడ్డూలను అందుబాటులో ఉంచేలా ఏర్పాట్లు చేస్తున్నారు. బ్రహ్మోత్సవాల్లో దేశంలోని 25 రాష్ట్రాలతో పాటు సింగపూర్, జర్మనీకి చెందిన కళాకారులు సాంస్కృతిక ప్రదర్శనలు ఇవ్వనున్నారు. భక్తుల భద్రత కోసం 3,000 మంది పోలీసులు, 2,500 మంది టీటీడీ నిఘా, భద్రతా సిబ్బందిని నియమించారు. పారిశుద్ధ్య నిర్వహణ కోసం 3,300 మంది సిబ్బందిని అందుబాటులో ఉంచుతున్నారు. ఈ ఏడాది గరుడసేవకు గతేడాదితో పోలిస్తే 15 నుంచి 20 శాతం అధికంగా భక్తులు వచ్చే అవకాశం ఉందని అంచనా వేస్తూ టీటీడీ విస్తృత ఏర్పాట్లు చేస్తోంది.