
అమరావతి: ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు ఈ-ఫైల్స్ క్లియరెన్స్‌లో వరుసగా మూడోసారి మొదటి స్థానం సాధించి హ్యాట్రిక్ కొట్టారు. ప్రభుత్వ శాఖల్లో ఫైళ్ల పరిష్కారాన్ని వేగవంతం చేయడంలో మంత్రి పనితీరుపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రశంసలు కురిపించారు. కలెక్టర్ల సమావేశంలో అచ్చెన్నాయుడు పనితీరును సీఎం ప్రత్యేకంగా ప్రస్తావించారు. గంటల వ్యవధిలోనే ఫైళ్లను పరిశీలించి నిర్ణయాలు తీసుకుంటూ పరిపాలనలో జాప్యాన్ని తగ్గిస్తున్నారని అభినందించారు. వేగంతో పాటు స్పష్టత, పారదర్శకత, సమర్థతకు ప్రాధాన్యం ఇస్తూ ఈ-ఫైలింగ్ వ్యవస్థను సమర్థవంతంగా వినియోగిస్తున్నారని పేర్కొన్నారు. వరుసగా మూడోసారి అగ్రస్థానంలో నిలవడం ఆయన పనితీరుకు నిదర్శనమని చంద్రబాబు ప్రశంసించారు. ఇతర శాఖలకు కూడా అచ్చెన్నాయుడు పనితీరు ఆదర్శంగా నిలుస్తోందని సీఎం పేర్కొన్నారు.