
అమరావతి: నేతన్న భరోసా పింఛన్ కోసం దరఖాస్తు చేసుకునే చేనేత కార్మికులకు కూటమి ప్రభుత్వం కీలక ఊరటనిచ్చింది. ఇకపై పింఛన్ దరఖాస్తుతో బ్యాంకు ఖాతా స్టేట్‌మెంట్ సమర్పించాల్సిన అవసరం లేదని రాష్ట్ర చేనేత, జౌళి శాఖ మంత్రి ఎస్. సవిత ప్రకటించారు. మాస్టర్ వీవర్ నుంచి వేతనాలు పొందుతున్నట్లు వివరాలు అందజేస్తే సరిపోతుందని స్పష్టం చేశారు. బ్యాంకు స్టేట్‌మెంట్ నిబంధనతో చేనేతలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను పలువురు మంత్రి దృష్టికి తీసుకెళ్లగా, ఆమె ఈ విషయాన్ని సీఎం చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లారు. నిబంధన సడలించాలని సీఎం ఆదేశించడంతో అర్హులైన నేతన్నలకు పింఛన్లు పొందే అవకాశం కలిగిందని మంత్రి తెలిపారు. 50 ఏళ్లు నిండిన అర్హులైన నేతన్నలందరికీ నేతన్న భరోసా పింఛన్లు అందిస్తామని ఆమె వెల్లడించారు. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటికే 85 వేల మందికిపైగా నేతన్నలకు నెలకు రూ.4 వేల పింఛన్ అందిస్తున్నట్లు తెలిపారు.