
అమరావతి: పవిత్ర హజ్ యాత్ర-2027కు ఎంపికైన యాత్రికులకు జిల్లాల వారీగా వైద్య పరీక్షలు నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు రాష్ట్ర మైనారిటీ, న్యాయశాఖ మంత్రి ఎన్‌ఎండీ ఫరూక్ తెలిపారు. హజ్ కమిటీ ఆఫ్ ఇండియా నిబంధనల ప్రకారం ఎంపికైన హాజీలు తప్పనిసరిగా వైద్య పరీక్షలు చేయించుకుని ఆరోగ్య, శారీరక దృఢత్వ ధ్రువీకరణ పత్రం పొందాల్సి ఉంటుందని చెప్పారు. ఇందుకోసం రాష్ట్రంలోని అన్ని జిల్లాల డీఎంహెచ్‌వోలకు రాష్ట్ర హజ్ కమిటీ ద్వారా ఆదేశాలు జారీ చేసినట్లు మంత్రి వెల్లడించారు. ప్రభుత్వ ఆరోగ్య కేంద్రాలు, ఆసుపత్రుల్లో అధీకృత ప్రభుత్వ వైద్యులు నిర్దేశిత పరీక్షలు నిర్వహించి, హజ్ కమిటీ ఆఫ్ ఇండియా సూచించిన నమూనాలో ధ్రువీకరణ పత్రాలను జారీ చేస్తారని తెలిపారు. హజ్ యాత్రికులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించినట్లు మంత్రి ఫరూక్ పేర్కొన్నారు.