
అమరావతి : మురసు తుఫాన్ నేపథ్యంలో జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు ఇరిగేషన్ ఉన్నతాధికారులతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించి, తుఫాన్ ప్రభావం, భారీ వర్షాలు, వరద పరిస్థితులపై సమీక్షించారు.
ఈ టెలీకాన్ఫరెన్స్‌లో ఇరిగేషన్ స్పెషల్ చీఫ్ సెక్రటరీ శశిభూషణ్ కుమార్, ప్రభుత్వ సలహాదారు వెంకటేశ్వరరావు, ఈఎన్సీ నరసింహమూర్తి, వివిధ ప్రాజెక్టుల చీఫ్ ఇంజనీర్లు (సీఈలు), సూపరింటెండింగ్ ఇంజనీర్లు (ఎస్ఈలు) పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మంత్రి నిమ్మల రామానాయుడు మాట్లాడుతూ.. ఈరోజు సాయంత్రం నెల్లూరు–ఒంగోలు మధ్య మురసు తుఫాన్ తీరం దాటే అవకాశం ఉన్నందున అధికారులు అత్యంత అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు.
కృష్ణా, పెన్నా నదీ పరివాహక ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున ఉమ్మడి గుంటూరు, ప్రకాశం, నెల్లూరు జిల్లాల ఇరిగేషన్ అధికారులు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.
నాగార్జునసాగర్ క్యాచ్మెంట్ ఏరియాలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున అక్కడి నుంచి వచ్చే వరద ప్రవాహాలపై నిరంతరం నిఘా ఉంచాలని తెలిపారు. గుండ్లకమ్మ, రాళ్లపాడు రిజర్వాయర్లకు వరద వచ్చే అవకాశం ఉన్నందున ఆయా ప్రాజెక్టుల అధికారులు అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు.
ప్రతి రెండు గంటలకు ఒకసారి రిజర్వాయర్లలోకి వస్తున్న నీటి ప్రవాహాలు, నీటిమట్టాలు, విడుదల చేస్తున్న నీటి వివరాలను క్షుణ్ణంగా పరిశీలిస్తూ ఎప్పటికప్పుడు ఉన్నతాధికారులకు నివేదించాలని స్పష్టం చేశారు.
తుఫాన్ ప్రభావంతో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పటిష్టమైన ఫ్లడ్ కంట్రోల్ మేనేజ్మెంట్ చేపట్టాలని మంత్రి ఆదేశించారు. ఇరిగేషన్, రెవెన్యూ, విపత్తుల నిర్వహణ శాఖలు సమన్వయంతో పనిచేస్తూ ఫ్లడ్ కంట్రోల్ సెల్ ఏర్పాటు చేయాలని సూచించారు.
ప్రజలకు ఎప్పటికప్పుడు వాతావరణం, వరద పరిస్థితులపై సమాచారం అందిస్తూ అప్రమత్తం చేయాలని, లోతట్టు ప్రాంతాల ప్రజలకు ముందస్తు హెచ్చరికలు జారీ చేయాలని తెలిపారు.
తుఫాన్ ప్రభావంతో ప్రజల ప్రాణ, ఆస్తి నష్టంతో పాటు పంట నష్టం జరగకుండా అన్ని శాఖలు సమన్వయంతో ముందస్తు చర్యలు చేపట్టాలని మంత్రి నిమ్మల రామానాయుడు అధికారులను ఆదేశించారు.