స్థానిక సంస్థల ఎన్నికల్లో ‘వార్ వన్ సైడ్’ : మంత్రి దుర్గేష్

నిడదవోలు: ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో రాష్ట్రవ్యాప్తంగా కూటమి ప్రభంజనం సృష్టించిందని, నిడదవోలు నియోజకవర్గంలో ‘వార్ వన్ సైడ్’ అయిందని రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ స్పష్టం చేశారు.

నిడదవోలు పట్టణంలోని క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. నియోజకవర్గంలోని ఉండ్రాజవరం, పెరవలి, నిడదవోలు మండలాల్లో అఖండ విజయం సాధించిన కూటమి అభ్యర్థులకు ఆయన హృదయపూర్వక అభినందనలు తెలిపారు.

చారిత్రాత్మక విజయం – అభ్యర్థులకు ఘన సత్కారం

నిడదవోలు నియోజకవర్గంలో మొత్తం 62 ఎంపీటీసీ స్థానాలకు గాను ఏకంగా 54 స్థానాల్లో కూటమి అభ్యర్థులు ఘన విజయం సాధించారు.

ఇందులో తెలుగుదేశం పార్టీ 29, జనసేన పార్టీ 24, భారతీయ జనతా పార్టీ 1 స్థానాన్ని దక్కించుకున్నాయని మంత్రి దుర్గేష్ వివరించారు…

నియోజకవర్గంలోని 3 జెడ్పీటీసీ స్థానాలను కూటమినే కైవసం చేసుకుందని అందులో టీడీపీ పెరవలి మండలంలో గెలుపొందగా, జనసేన ఉండ్రాజవరం, నిడదవోలు మండలాల్లో ప్రభంజనం సృష్టించిందన్నారు..

ప్రత్యేకించి ఉండ్రాజవరం జెడ్పీటీసీలో జనసేన క్లీన్ స్వీప్ చేసిందని ఆనందం వ్యక్తం చేశారు. దాదాపు అన్ని చోట్లా 11 వేల ఓట్లకు పైగా భారీ మెజార్టీ రావడం ప్రజల్లో కూటమి పట్ల ఉన్న అపారమైన నమ్మకానికి నిదర్శనమని మంత్రి దుర్గేష్ వ్యాఖ్యానించారు. విజయం సాధించిన అభ్యర్థులను ఆయన ఈ సందర్భంగా ఘనంగా సత్కరించారు.

కూటమి నేతల సమిష్టి కృషి – కూటమికి పట్టం కట్టిన ప్రజలకు ధన్యవాదాలు

ఈ చారిత్రాత్మక విజయం సమిష్టి కృషి ఫలితమని మంత్రి దుర్గేష్ తెలిపారు.నియోజకవర్గంలో తాను, టీడీపీ నియోజకవర్గ ఇంచార్జ్, ఏపీ స్కిల్ డెవలప్‌మెంట్ చైర్మన్ బూరుగుపల్లి శేషారావు, బీజేపీ నాయకత్వం ఒకే తాటిపై నిలిచి పనిచేశామని పేర్కొన్నారు.

రాష్ట్ర స్థాయిలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ , ప్రధాని శ్రీ నరేంద్ర మోదీల నాయకత్వంలో జరుగుతున్న అభివృద్ధి సంక్షేమ పాలనకు ప్రజలు పట్టంకట్టారని కొనియాడారు.

గ్రామాల్లో పంచాయతీరాజ్ శాఖ ద్వారా చేపట్టిన రహదారుల అభివృద్ధి, సురక్షిత తాగునీటి సరఫరా, డ్రైనేజీ వ్యవస్థల ఏర్పాటు ఈ విజయానికి ప్రధాన కారణాలని వివరించారు.

రాబోయే సర్పంచ్ ఎన్నికల్లోనూ ఇదే తరహా విజయాన్ని కట్టబెట్టాలని, పైన, క్రింద కూటమి ప్రభుత్వమే ఉంటే క్షేత్రస్థాయి అభివృద్ధి వేగవంతమవుతుందని అన్నారు..

ఎన్నికల కంటే ప్రజాసేవే ముఖ్యం – తుఫాన్ బాధితులకు అండగా కూటమి

ఒకవైపు ఎన్నికల హడావిడి ఉన్నప్పటికీ, అర్నబ్, మురసు తుఫాన్ల ధాటికి ఎర్రకాలువ ఉప్పొంగి నిడదవోలు ప్రజలు, రైతాంగం తీవ్రంగా నష్టపోయిన వేళ తాము ప్రజాసేవకే తొలి ప్రాధాన్యం ఇచ్చామని మంత్రి దుర్గేష్ తెలిపారు.

పోలింగ్, ఓట్ల కౌంటింగ్, ప్రచారం కంటే ప్రజల ప్రాణరక్షణ, సహాయక చర్యలే ముఖ్యమని భావించి తాను, బూరుగుపల్లి శేషారావు,కూటమి శ్రేణులు క్షేత్రస్థాయిలోకి వెళ్లి తుఫాన్ బాధితులకు నిత్యావసర సరుకులు, తాగునీరు, భోజనం, మెడిసిన్లు అందించి ధైర్యాన్ని నింపామన్నారు.

విపత్తు వేళ పారిపోయిన విపక్షంపై తీవ్ర ఆగ్రహం

ఇంతటి తీవ్రమైన విపత్తు సమయంలో ప్రజలను ఆదుకోవడంలో ప్రతిపక్ష నాయకుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి దారుణంగా విఫలమయ్యారని మంత్రి కందుల దుర్గేష్ మండిపడ్డారు.

తుఫాన్ ధాటికి ప్రజలు అతలాకుతలమవుతుంటే వారిని ఓదార్చాల్సింది పోయి, మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డి భారీ ర్యాలీతో పులివెందులకు వెళ్లి అక్కడే పరిమితమవడం సిగ్గుచేటన్నారు.

గతంలో గెలిచిన నిడదవోలు మాజీ ఎమ్మెల్యే కూడా విపత్తు సమయంలో ముఖం చాటేశారని, గెలిచినప్పుడే కాదు ఓడినప్పుడు కూడా ప్రజలకు అండగా ఉండేవాడే నిజమైన నాయకుడని హితవు పలికారు.

వైసీపీ నేతలకు ఓట్లు, రాజకీయం మాత్రమే ముఖ్యమని, ప్రజా సమస్యలు పట్టవని ఎద్దేవా చేశారు.విపక్ష నాయకులు కేవలం ఎన్నికల ప్రచారానికే పరిమితమవుతున్నారని మండిపడ్డారు.

“ప్రజల ఓట్లు మాత్రమే కావాలా మీకు? కష్టకాలంలో ఉన్న ప్రజలకు భరోసానివ్వరా?” అని వైఎస్సార్సీపీ నేతలను నిలదీశారు.

తమ కూటమి ప్రభుత్వం ఎన్నికల హడావిడి ఉన్నప్పటికీ కౌంటింగ్, పోలింగ్, ప్రచారాల కంటే ప్రజా సమస్యల పరిష్కారానికే అగ్రతాంబూలం ఇచ్చిందని తెలిపారు.

అధికారం ఉన్నా లేకపోయినా ప్రజల సేవే ముఖ్యమని భావించాలని, ఇప్పటికైనా వైసీపీ నేతలు కళ్లు తెరిచి మారాలని హితవు పలికారు.

రాష్ట్ర ప్రజలకు దీపావళి శుభాకాంక్షలు

చెడుపై మంచి సాధించిన విజయానికి సంకేతమైన దీపావళి పండుగ సందర్భంగా రాష్ట్ర ప్రజలందరికీ మంత్రి కందుల దుర్గేష్ శుభాకాంక్షలు తెలిపారు.

“రాజకీయాల్లో నరకాసురుడిని తలపించే మనస్తత్వం ఉన్న నాయకులను పక్కనబెట్టి, ఏపీకి సరికొత్త ప్రజాస్వామ్య వెలుగులను అందించిన ఓటర్లందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.

ప్రజల మనస్సులో ఎప్పుడూ సైకిల్, గాజు గ్లాస్, కమలం గు గుర్తులే ఉంటాయని మంత్రి దుర్గేష్ స్పష్టం చేశారు. క్రాస్ ఓటింగ్‌ను అడ్డుపెట్టుకుని వివాదాలు సృష్టించాలనుకున్న వైసీపీకి ప్రజలు ఓటు ద్వారా సరైన బుద్ధి చెప్పారని, త్వరలోనే నిడదవోలు నియోజకవర్గాన్ని మోడల్ నియోజకవర్గంగా తీర్చిదిద్దుతామని ఆయన హామీ ఇచ్చారు..

ఈ సందర్భంగా ఎన్నికల్లో పోటీ చేయడానికి ముందుకొచ్చిన ప్రతి ఒక్కరికీ మంత్రి దుర్గేష్ ధన్యవాదాలు తెలిపారు.టికెట్/సీటు రాకపోయినా నిరాశ చెందకుండా కూటమి విజయం కోసం అహర్నిశలు కృషి చేసిన కూటమి నాయకులు, కార్యకర్తల త్యాగాన్ని మంత్రి దుర్గేష్ ప్రత్యేకంగా కొనియాడారు..

ఇంత మంది నాయకులకు ప్రజా సేవ చేసే చక్కని అవకాశం కల్పించిన ప్రధాని నరేంద్ర మోదీ, సీఎం నారా చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ లకు మంత్రి కందుల దుర్గేష్ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు.

త్వరలో రాబోయే సర్పంచ్ ఎన్నికల్లోనూ ఇదే తరహా విజయాన్ని కట్టబెట్టాలని పిలుపునిచ్చారు.