పంచాయతీ పోరులోనూ కూటమి జోరు చూపించాలి -మంత్రి కొల్లు రవీంద్ర

మచిలీపట్నం : పంచాయతీ ఎన్నికల్లోనూ మచిలీపట్నంలో కూటమి జెండాను ఎగరవేసేలా ప్రతి కార్యకర్త, ప్రతి నాయకుడు క్షేత్రస్థాయిలో పని చేయాలని రాష్ట్ర గనులు, భూగర్భ వనరులు, ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర పేర్కొన్నారు.

ఈ మేరకు మచిలీపట్నంలోని క్యాంపు కార్యాలయంలో గెలుపొందిన ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల్లో అభ్యర్థులతో ఆత్మీయ సమావేశం నిర్వహించారు.

అభ్యర్ధులకు శుభాకాంక్షలు తెలిపారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో సాధించిన ఈ విజయం కూటమిపై ప్రజలకున్న నమ్మకానికి నిదర్శనమన్నారు.

ఇంతటితో సంతృప్తి చెందకుండా, త్వరలో జరగనున్న పంచాయతీ ఎన్నికల్లో కూడా కూటమి బలోపేతానికి అభ్యర్థుల గెలుపు కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు.

మచిలీపట్నం పరిధిలోని 34 పంచాయతీల్లోనూ కూటమి అభ్యర్థులను గెలిపించేందుకు సమష్టిగా పనిచేయాలని సూచించారు. వైసీపీ ఉనికి కనిపించకుండా చేసే దిశగా ప్రతి ఒక్కరూ పనిచేయాలన్నారు.

కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పంచాయతీల్లో చేపట్టిన అభివృద్ధి పనులను ప్రజలకు వివరించాలన్నారు.

గత ప్రభుత్వ హయాంలో జరిగిన తప్పిదాలను కూడా ప్రజల దృష్టికి తీసుకెళ్లాలని సూచించారు. జల్‌జీవన్ మిషన్ కింద ఇంటింటికీ కుళాయి కనెక్షన్లు, కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత నిర్మించిన రోడ్లను ప్రజలకు వివరిస్తూ ముందుకు వెళ్లాలన్నారు.

కూటమి ప్రతిష్ఠను నిలబెట్టేలా నాయకులు, కార్యకర్తలు బాధ్యతతో పనిచేయాలని సూచించారు. మీరు పడిన కష్టం, సమష్టి కృషి ఫలితంగానే స్థానిక ఎన్నికల్లో ఘన విజయం సాధించాం. అదే స్పూర్తితో పంచాయతీల్లోనూ మన సత్తా చాటాలని మంత్రి కొల్లు రవీంద్ర సూచించారు.

కార్యక్రమంలో ఏపీఎస్ఆర్టీసీ చైర్మన్ కొనకళ్ల నారాయణరావు, డీసీఎంఎస్ చైర్మన్ బండి రామకృష్ణ, జిల్లా పార్టీ ప్రధాన కార్యదర్శి గోపు సత్యనారాయణ, మార్కెట్ యార్డ్ చైర్మన్ కుంచె దుర్గాప్రసాద్, తెలుగుదేశం పార్టీ నాయకుడు రొండి కృష్ణ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.