
అమరావతి: రాష్ట్రంలో పోలీస్ కానిస్టేబుల్,సబ్ ఇన్స్పెక్టర్ ల నియామకాల కోసం నోటిఫికేషన్ విడుదలైన నేపథ్యంలో మైనారిటీ నిరుద్యోగ అభ్యర్థులకు ఉచిత శిక్షణ ఇవ్వబోతున్నట్లు మైనారిటీ,న్యాయ శాఖల మంత్రి ఎన్ఎండి ఫరూక్ వెల్లడించారు. మైనారిటీ సంక్షేమ శాఖ ఆధ్వర్యం లో సెంటర్ ఫర్ ఎడ్యుకేషనల్ డెవలప్మెంట్ ఆఫ్ మైనారిటీస్ (సిఈడిఎం) ద్వారా ఆఫ్ లైన్, ఆన్ లైన్ విధానంలో పోటీ పరీక్షలకు హాజరయ్యే అర్హత కలిగిన వారికి శిక్షణ ఇచ్చేందుకు కార్యాచరణ సిద్ధం చేశామని సోమవారం అమరావతిలో విడుదల చేసిన ఒక ప్రకటనలో మంత్రి పేర్కొన్నారు. ఇందుకోసం అర్హత కలిగిన వారి నుండి దరఖాస్తులకు ఆహ్వానం పలకడం జరిగిందన్నారు. తుది గడువు ఈ నెలాఖరు 30వ తేదీ లోపు ఆన్ లైన్ ద్వారా సిఈడిఎం వెబ్ సైట్ లో దరఖాస్తులు పంపాలని కోరారు. ఆఫ్ లైన్ ఉచిత శిక్షణకు తప్పనిసరి అర్హతగా బిపిఎల్ కార్డు కలిగి ఉండాలని తెలిపారు.దరఖాస్తు సమయంలోనే సంబంధిత బిపిఎల్ కార్డు ( తెల్ల రేషన్ కార్డు / ధృవీకరణపత్రం )సమర్పించాలని మంత్రి ఫరూక్ పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ పోలీస్ శాఖలో చేరాలని ఆకాంక్షించే, పట్టుదల కలిగిన మైనారిటీ అభ్యర్థులకు నాణ్యమైన శిక్షణ తో పాటు విద్యాపరమైన మద్దతును అందించడమే సిఈడిఎం ఉచిత శిక్షణ కార్యక్రమ ముఖ్య ఉద్దేశ్యమని అన్నారు. పోలీసు ఉద్యోగాలకు పోటీపడే మైనారిటీ అభ్యర్థులకు రాత పరీక్ష సన్నద్ధత, జనరల్ స్టడీస్, రీజనింగ్, కరెంట్ అఫైర్స్, నియామక పరీక్షకు నిర్దేశించిన, సంబంధిత అన్ని అంశాలపై దృష్టి సారించి తర్ఫీదును పూర్తిస్థాయిలో ఇవ్వడం జరుగుతుందన్నారు. పోలీస్ కానిస్టేబుల్, సబ్ ఇన్స్పెక్టర్ ఉద్యోగాల కోసం పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న మైనారిటీ వర్గాలకు చెందిన అర్హులైన అభ్యర్థులు, నిర్దేశించిన అర్హతా షరతులకు లోబడి దరఖాస్తు చేసుకోవచ్చునని మంత్రి సూచించారు.అర్హత,ఆసక్తిగల రాష్ట్రవ్యాప్త మైనారిటీ అభ్యర్థులందరూ తమ వివరాలను “సిఈడిఎం-ఏపీ” అధికారిక వెబ్ సైట్ ద్వారా తమకు సంబంధించిన అన్ని పూర్తిగా వివరాలతో వెబ్ సైట్: www.apcedmmwd.org లో నమోదు చేసుకోవాలని కోరారు. పూర్తి వివరాలకు: 08645-297535, 7386789966 లకు సంప్రదించాలన్నారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు సారధ్యంలోని కూటమి ప్రభుత్వం మైనారిటీల సంక్షేమానికి అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్నదని అన్నారు. ఇందులో భాగంగానే కూటమి ప్రభుత్వం హామీ ఇచ్చినట్లుగా విడుదల చేస్తున్న జాబ్ నోటిఫికేషన్ల లో మైనారిటీ నిరుద్యోగ యువతకు అండగా నిలిచేందుకు కూటమి ప్రభుత్వం ఉచిత శిక్షణను ఏర్పాటు చేసిందన్నారు. పోలీస్ శాఖలో నియామకాల కోసం నిర్వహిస్తున్న పోటీ పరీక్షలకు హాజరయ్యే మైనారిటీ అభ్యర్థులకు ఉచిత శిక్షణ ఇస్తున్న దృష్ట్యా మైనారిటీ నిరుద్యోగ యువత ఈ అవకాశాలను అందిపుచ్చుకొని విజయం సాధించాలని మైనారిటీ మంత్రి ఎన్ఎండి ఫరూక్ పిలుపునిచ్చారు.