
కాకినాడ : ‘గత ప్రభుత్వంలో పారిశ్రామికవేత్తలు భయపడే పరిస్థితి ఉండేది. రాష్ట్రంలో మీరు పరిశ్రమ పెడితే.. మాకేమిస్తారు..? అని అడిగే విష సంస్క్రతి అప్పట్లో ఉండేది. కూటమి ప్రభుత్వం పెట్టుబడిదారులకు రాష్ట్రాన్ని స్వర్గధామంగా మారుస్తోంది.
మీరు పెట్టుబడులుపెడితే రాష్ట్రానికి ఏం ఇస్తారు..? ప్రజలకు ఏం చేస్తారు అని అడిగి సత్సంప్రదాయంతో కూటమి ప్రభుత్వం పని చేస్తోంద’ని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు.
పరిశ్రమలకు రాష్ట్రంలో అపార అవకాశాలున్నాయి. వాటిని అందిపుచ్చుకొని, ఆంధ్రప్రదేశ్ పురోగతిలో పెట్టుబడిదారులు భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.
కాకినాడ జేఎన్టీయూలో సోమవారం జరిగిన సీఐఐ ప్రాంతీయ సదస్సుకు పవన్ కళ్యాణ్ గారు ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ… ‘‘విశ్రాంత ఉద్యోగుల ప్యారడైజ్ నగరంగా భావించే కాకినాడలో తొలిసారి సీఐఐ ప్రాంతీయ సదస్సు జరగడం ఆనందంగా ఉంది.
విశాఖపట్నం తర్వాత రాష్ట్రంలో రెండో ప్రాంతీయ సదస్సుకు కాకినాడ వేదిక కావడం గొప్ప మైలురాయి. కాకినాడ పారిశ్రామిక ప్రగతి చరిత్రలో రూ.6,347 కోట్ల పెట్టుబడులు రావడం కొత్త అవకాశాలకు పునాది వేస్తుంది. ఈ ప్రాంతం మరింత పురోగతి చెందడానికి ఇది ఇంధనంగా పని చేస్తుంది.
18 వేల మందికి ఉపాధి
16 ఎంఓయూల ద్వారా రూ.4,652 కోట్లు పెట్టుబడులు, రూ.2,090 కోట్లతో పూర్తయిన 4 ప్రత్యేక ప్రాజెక్టులకు శంకుస్థాపనలు జరగడం శుభసూచకం. ఈ ప్రాజెక్టుల ద్వారా కాకినాడ, చుట్టుపక్కల ప్రాంతాల్లో 18 వేల మందికి ఉపాధి లభించనుంది.
ఇది యువతకు ఉపాధి భరోసాను ఇవ్వడంతోపాటు ఎన్నో కుటుంబాలకు ఓ ఆసరాను చూపించే గొప్ప కార్యక్రమంగా నిలిచిపోతుంది.
సింగపూర్ ఎదిగిన క్రమం మనకు స్ఫూర్తి
1965 ప్రాంతంలో సింగపూర్ అనే దేశం అత్యంత పేద దేశం. కనీస అవసరాలు తీర్చుకోవడానికి, దేశం ముందుకు వెళ్లడానికి సరైన అవకాశాలు లేని స్థితి నుంచి తన అభివృద్ధి ప్రయాణాన్ని మొదలుపెట్టింది.
ఒక్కో ఇటుక పేర్చుకుంటూ సంకల్ప బలంతో, సమష్టి కృషితో ఈనాటి ప్రపంచంలో అద్భుతమైన దేశంగా మారింది. స్విట్జర్లాండ్ దేశ నమూనా కూడా అలాంటిదే.
మనలో స్పష్టత, ఐక్యత, జాతీయత ఉంటే కచ్చితంగా దేశాన్ని పురోగమన దిశగా ముందుకు తీసుకెళ్లవచ్చు. పారిశ్రామికవేత్తలకు అన్ని విధాలా సహకరించేందుకు, వారిని ముందుకు తీసుకెళ్లేందుకు ప్రభుత్వం సంసిద్ధంగా ఉంది.
వారికి తగిన ప్రోత్సాహకాలు, అనుమతులు త్వరితగతిన ఇస్తున్నాం. పారిశ్రామికవేత్తలు కూడా అదే నిబద్దతతో, పర్యావరణ హితంగా యువతకు మెరుగైన ఉపాధి చూపుతూ రాష్ట్రాభివృద్ధికి సహకరించాలి.
జంషెడ్జీ టాటా దేశాన్ని ముందుకు నడిపారు
పారిశ్రామికవేత్తలు కేవలం లాభం లెక్కలు మాత్రమే వేయకుండా మనతో పాటు దేశం, జాతిని ముందుకు తీసుకెళ్లాలనే సంకల్పం చేసుకోవాలి.
కార్పొరేట్ సోషల్ రెస్పాన్స్బిలిటీ ఫండ్స్ ద్వారా సమాజానికి మేలు చేయాలనే ఆలోచన ఎల్లవేళలా ఉండాలి. భారతదేశ అభివృద్ధికి జంషెడ్జీ టాటా చేసిన ఎన్నో కార్యక్రమాలు స్ఫూర్తిగా నిలుస్తాయి.
ఆయన కేవలం పరిశ్రమలంటే లాభాలు అర్జించే మార్గాలుగానే కాకుండా, జాతిని ముందుకు నడిపించే ఇంధనాలుగా భావించారు. ఎన్నో ప్రజోపయోగ కార్యక్రమాలు నిర్వర్తించారు.
అలాంటి వారు మనకు ఎల్లవేళలా స్ఫూర్తిగా నిలుస్తారు. పెట్టుబడుల రాక, పరిశ్రమల స్థాపన అనేది కేవలం లెక్కలు కింద, పారిశ్రామిక ప్రగతి కింద మాత్రమే చూడకూడదు. ఇది వేలాది కుటుంబాల జీవనశైలిని మార్చబోయే భరోసాగా భావించాలి.
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మార్గదర్శకంలో, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడి నాయకత్వంలో 2024, జూన్ నుంచి రాష్ట్రానికి 714 ప్రాజెక్టుల రూపంలో రూ.22.6 లక్షల కోట్ల పెట్టుబడులు రాష్ట్రానికి వచ్చాయి.
వీటిలో రూ.16.6 లక్షల కోట్ల ప్రాజెక్టులకు ప్రభుత్వ అనుమతులు పూర్తయితే, రూ.4.7 కోట్ల ప్రాజెక్టులు గ్రౌండింగ్ అయ్యాయి. వీటి వల్ల రాష్ట్రంలో 7.1 లక్షల ఉద్యోగాలు యువతకు రానున్నాయి.
తీర ప్రాంతం రాష్ట్రానికి వరం
రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకురావడం అంటే కేవలం ఒప్పందాలు కుదుర్చుకోవడం మాత్రమే కాదు.. వాటిని పూర్తిస్థాయిలో ప్రారంభించేలా ప్రభుత్వం చొరవ తీసుకుంటోంది.
ప్రాజెక్టుల రాకకు, పెట్టుబడుల విస్తృతం చేయడానికి, ప్రారంభానికి అన్ని రకాల అనుమతులను పారదర్శకంగా, వేగంగా ఇచ్చేలా ప్రభుత్వం ప్రత్యేక వ్యవస్థను చక్కగా నిర్వర్తిస్తోంది.
దీనివల్లనే దేశంలోనే ఆంధ్రప్రదేశ్ పెట్టుబడులకు ప్యారడైజ్ గా మారింది.
కాకినాడ పేరు చెప్పగానే శ్రమజీవుల వేదికగా గుర్తుకొస్తుంది. కార్మికులు, కర్షకులు, మత్స్యకారులు, వేతన జీవులు అధికం.
అవకాశం అందిపుచ్చుకునే యువత ఉన్నారు. మార్పును అందిపుచ్చుకునే సామర్థ్యం కాకినాడకు ఉంది. మారిటైమ్ బోర్డు పరిశ్రమలు, నౌక నిర్మాణ పరిశ్రమలు, గ్రీన్ హైడ్రోజన్, రసాయన, ఆహార శుద్ధి, ఆక్వా ఉత్పత్తుల పరిశ్రమలు రాబోతున్నాయి.
వచ్చే పరిశ్రమలన్నీ ప్రపంచంతో అనుసంధానమై, ఇక్కడి ఉత్పత్తులను ప్రపంచమంతా తీసుకెళ్లే అవకాశం ఉన్నవి. ఆంధ్రప్రదేశ్ కు 1053 కిలోమీటర్ల తీర ప్రాంతం ఓ వరం. దాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఉంది.
సుస్థిరమైన పారిశ్రామిక అభివృద్ది ఎంత ముఖ్యమో, తీరం రక్షణ అంతే ప్రధానం. దీనికి పరిశ్రమలు తగిన విధంగా సహకరించాలి. గ్రేట్ గ్రీన్ వాల్ నిర్మాణానికి ప్రభుత్వం ప్రాధాన్యతనిస్తోంది.
పచ్చదనం పెంపు, పర్యావరణహితమైన పారిశ్రామిక అభివృద్ధి రాష్ట్రానికి ప్రధానం. తీర ప్రాంత రక్షణ, అక్కడ జీవుల మనుగడ, అభివృద్దిపైన ప్రభుత్వం కట్టుబడి పని చేస్తుంది.
పల్లెల వైపు పెట్టుబడులు రావాలి
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పల్లెలు, ఏజెన్సీ ప్రాంతాల్లో సౌకర్యాలు పెంపు, మౌలిక సదుపాయాల కల్పనకు ప్రాధాన్యం ఇస్తోంది. రాష్ట్రంలో పల్లె పండుగ, అడవితల్లి బాట పేరుతో చేస్తున్న కార్యక్రమాలు గ్రామాలు, గిరిజన ఆవాసాలకు సౌకర్యాల కళను తీసుకొస్తున్నాయి.
రూ.1.70 లక్షల కోట్లతో పల్లెలు, ఏజెన్సీల్లో ముమ్మరంగా రోడ్లు, డ్రైయిన్లు, అనుసంధాన దారులు, ఇతర సౌకర్యాలను పెంచే కార్యక్రమం చేస్తున్నాం.
పారిశ్రామికవేత్తలు, పెట్టుబడిదారులు పల్లెలు, గిరిజన ప్రాంతాల్లో కూడా తమ దృష్టి నిలిపి, పరిధిని విస్తరించాలని కోరుతున్నాను. దీనిద్వారా అన్ని ప్రాంతాలకు అభివృద్ది విస్తరించడం సులభం అవుతుంది. తద్వారా గ్రామాలకు కొత్త అవకాశాలను సృష్టించడం సులభం అవుతుంది.
ఆంధ్రప్రదేశ్ లో నూతన పరిశ్రమలకు పెట్టుబడులు పెట్టేముందు పారిశ్రామిక వేత్తలు భూమి గురించో, సౌకర్యాల కల్పన, అనుమతులు గురించో కాదు.. సుస్థిరమైన, సమర్థవంతమైన పాలన చూస్తున్నారు.
రాష్ట్రంలో శాంతిభద్రతల పరిరక్షణ, ప్రభుత్వం మీద నమ్మకంతో వారు పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వస్తున్నారు. ఎక్కడైతే ప్రశాంతమైన పరిస్థితులు, వృద్ధి చెందడానికి అవకాశాలు ఉంటాయో అక్కడ పెట్టుబడులు పెట్టేందుకు పారిశ్రామికవేత్తలు ముందుకు వస్తారు.
అలాంటి పరిస్థితి రాష్ట్రంలో ఉంది. గత ప్రభుత్వంలో కొత్త పరిశ్రమలు రాష్ట్రానికి రాకపోగా, ఉన్న పరిశ్రమలు వేరే రాష్ట్రాలకు తరలిపోయాయి. కూటమి ప్రభుత్వం రాష్ట్రంలో సుస్థిరమైన ప్రగతిని సాధిస్తూ, యువతకు ఉపాధిని చూపుతూ, శాంతిభద్రతల పరిరక్షణకు ప్రథమ ప్రాధాన్యం ఇస్తోంది.
పారిశ్రామిక ప్రగతి, పర్యావరణ అభివృద్ధి అనేవి జోడెడ్లుగా ముందుకు సాగితేనే రాష్ట్రం అన్ని విధాలుగా నూతన కళను సంతరించుకుంటుంది.
రండి.. రాష్ట్ర ప్రగతిలో భాగం పంచుకోండి
రాష్ట్రంలోకి ఎంతో ఉత్సాహంతో వస్తున్న పెట్టుబడిదారులకు నేను చెప్పేది ఒకటే. రండి.. ఆంధ్రప్రదేశ్ పునర్నిర్మాణంలో మాతో కలిసి నడవండి.. ప్రజల ఉన్నతి కోసం పనిచేయండి.
స్థానిక పెట్టుబడులతో యువతకు ఉపాధి నైపుణ్యాలను కల్పించి ఉద్యోగాలు వస్తాయి. వ్యాపారులకు వ్యాపారం జరుగుతుంది. గ్రామీణులు, మత్స్యకారులతోనూ పనిచేసే అవకాశం ఉంటుంది.
పెట్టుబడులు పెడుతున్న మొదటిరోజు నుంచే పర్యావరణ హితమైన పారిశ్రామిక అభివృద్ది అనే కోణంలోనే ముందుడుగు వేయండి. ఆంధ్రప్రదేశ్ లో ప్రతి రంగం అభివృద్ధి చెందేలా, ప్రతి వర్గం ఉన్నతి సాధించేలా ఓ సమగ్ర ప్రణాళికతో ముందుకు వెళ్తున్నాం.
దీనిలో భాగస్వామ్యం అవుతున్న ప్రతి ఒక్కరికీ నా హృదయ పూర్వక ధన్యవాదాలు” అన్నారు.
ఈ కార్యక్రమంలో రాష్ట్ర మంత్రులు టీజీ భరత్, బీసీ జనార్ధన్ రెడ్డి, కందుల దుర్గేష్, ఎంపీలు తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్, హరీష్ మాధుర్, సానా సతీష్ బాబు, సీఐఐ ఆంధ్రప్రదేశ్ వైస్ ఛైర్మన్ సాంబశివరావు తదితరులు పాల్గొన్నారు.