
అమరావతి/కలకత్తా : ఆంధ్రప్రదేశ్ పర్యాటక రంగానికి జాతీయ స్థాయిలో గొప్ప గుర్తింపు లభించింది. ప్రముఖ పర్యాటక సంస్థ ‘ట్రావెల్ ఏజెంట్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా’ (TAAI) 75 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా, కలకత్తాలోని ‘ది బెంగాల్ స్టేట్ రూమ్ – ఐటీసీ రాయల్ బెంగాల్’ వేదికగా నిర్వహించిన 69వ ఇండియన్ ట్రావెల్ కాంగ్రెస్ వార్షిక సదస్సు, ప్రదర్శనలో రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ పాల్గొన్నారు .
ఈ సందర్భంగా పర్యాటక రంగాన్ని ప్రగతిపథంలో నడిపిస్తున్నందుకు గాను మంత్రి కందుల దుర్గేష్‌ను ‘ఎక్సలెన్స్ ఇన్ టూరిజం లీడర్షిప్ అవార్డు’ వరించగా, పర్యాటక రంగంలో వినూత్న సంస్కరణలు తీసుకొస్తున్నందుకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ‘అవార్డ్ ఆఫ్ మెరిట్ – అవుట్‌స్టాండింగ్ టూరిజం స్టేట్ ఆఫ్ ఇండియా’ పురస్కారం దక్కింది.
ఈ రెండు ప్రతిష్టాత్మక అవార్డులను నిర్వాహకుల నుండి మంత్రి కందుల దుర్గేష్ అందుకున్నారు.
ఈ సందర్భంగా మంత్రి కందుల దుర్గేష్ మాట్లాడుతూ.. ట్రావెల్ ఏజెంట్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా నిర్వాహకులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.
కేంద్ర ప్రభుత్వ సహకారంతో, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ల దూరదృష్టి కలిగిన నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్ పర్యాటక రంగం దినదినాభివృద్ధి చెందుతోందని చెప్పారు.
ఈ అవార్డుల రాకతో బాధ్యత మరింత పెరిగిందని, కొత్త ఉత్సాహంతో ఏపీ పర్యాటకాన్ని అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లేందుకు కృషి చేస్తామని స్పష్టం చేశారు.
ఈ సందర్భంగా వైవిధ్యభరితమైన ప్రయాణ అనుభూతులను అందించే ఆంధ్రప్రదేశ్ ను కొత్త కోణంలో ఆవిష్కరించాల్సిందిగా ట్రావెల్ రంగాన్ని మంత్రి దుర్గేష్ ఆహ్వానించారు.
అదే విధంగా ఏపీ పర్యాటక ప్రాంతాలను సందర్శించాలని, ఏపీని ప్రపంచానికి పరిచయం చేయాలని కోరారు. ఈ సందర్భంగా 75 ఏళ్లు పూర్తిచేసుకున్న టీఏఏఐకి హృదయపూర్వక అభినందనలు తెలిపారు.
ఏపీని భారతదేశ పర్యాటక పటంలో అగ్రగామిగా నిలబెట్టేందుకు మంత్రి కందుల దుర్గేష్ నిరంతరం శ్రమిస్తున్నారని టీఏఏఐ ప్రతినిధులు ప్రశంసించారు.