
కాకినాడ : దేశంలోనే ప్రధాన పర్యాటక గమ్యస్థానంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని తీర్చిదిద్దుతామని రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ స్పష్టం చేశారు.
కాకినాడ జేఎన్టీయూ వేదికగా నిర్వహించిన 31వ సీఐఐ సన్నాహక ప్రాంతీయ సదస్సుకు ముఖ్య అతిథిగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ హాజరయ్యారు..
ఈ సందర్భంగా మంత్రి కందుల దుర్గేష్ సదస్సులో పర్యాటక రంగంలో పెట్టుబడులు పెట్టేందుకు అవకాశాలు మెండుగా ఉన్నాయని ఇన్వెస్టర్లను ఆహ్వానిస్తూ కీలక ప్రసంగం చేశారు.అంతకుముందు యూనివర్సిటీ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన వివిధ స్టాళ్లను సందర్శించారు.

ఈ సందర్భంగా మంత్రి కందుల దుర్గేష్ మాట్లాడుతూ..నవంబర్ 12,13 తేదీల్లో విశాఖపట్నంలో జరగనున్న ప్రతిష్ఠాత్మక ‘సీఐఐ పార్ట్నర్ షిప్ సమ్మిట్’కు కాకినాడతో పాటు వివిధ ప్రాంతాల్లో జరుగుతున్న ఈ ప్రాంతీయ సదస్సులు ప్రిపరేటరీ వర్క్‌షాప్‌లుగా ఉపయోగపడతాయని తెలిపారు.
ఈ సమావేశాల ద్వారా రూపొందించే కామన్ కన్సాలిడేటెడ్ నివేదికలను విశాఖ సమ్మిట్‌లో ప్రవేశపెడతామన్నారు.విజనరీ లీడర్ సీఎం నారా చంద్రబాబు నాయుడు, ప్రజా నాయకుడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ లు పర్యాటక రంగానికి ప్రత్యేక ప్రాధాన్యతనిస్తున్నారని స్పష్టం చేశారు.
నూతన పర్యాటక పాలసీ 2024-29, పర్యాటక రంగానికి పారిశ్రామిక హోదా కల్పించడం ద్వారా గత రెండున్నరేళ్లలో రూ. 20,000 కోట్ల పెట్టుబడులను ఆకర్షించగలిగామని వెల్లడించారు.
పబ్లిక్-ప్రైవేట్ పార్ట్నర్ షిప్ విధానంలో రాష్ట్రానికి ప్రముఖ స్టార్ హోటళ్లు వస్తున్నాయన్నారు..క్యారవాన్ టూరిజం, హోమ్‌స్టే, భూ కేటాయింపుల కోసం నూతన పాలసీలు అమల్లోకి తీసుకొచ్చామన్నారు.
తదవ్ారా రిసార్టులు, హోటళ్లు లేదా ఇతర పర్యాటక ప్రాజెక్టులు ఏర్పాటు చేసే వారికి అవసరమైతే ఇతర శాఖల భూములను కూడా పర్యాటక శాఖకు బదిలీ చేసి కేటాయిస్తామని తెలిపారు.
పరిశ్రమలకు ఇచ్చే రాయితీలన్నీ పర్యాటక పెట్టుబడిదారులకూ వర్తింపజేస్తామని స్పష్టం చేశారు.
రాష్ట్రంలో ఉన్న 1,053 కిలోమీటర్ల సుదీర్ఘ తీరప్రాంతం వెంట యోగా, ఆయుర్వేద కేంద్రాలతో కూడిన వెల్నెస్ సెంటర్ల అభివృద్ధికి అపారమైన అవకాశాలున్నాయని వివరించారు.
కేరళలో జరిగిన జీటీఎం సదస్సులో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి లభించిన ‘బెస్ట్ టూరిజం ప్రమోషన్ అవార్డు’ పర్యాటక రంగంలో సాధించిన గొప్ప విజయమని పేర్కొన్నారు.
ఇటీవల రాజమహేంద్రవరంలో ప్రపంచ పర్యాటక దినోత్సవం సందర్భంగా ప్రారంభించిన ‘గోదావరి కాల్స్’ కార్యక్రమాన్ని భవిష్యత్తులో ఇతర పరిశ్రమలకు కూడా విస్తరించి పర్యాటకులకు సరికొత్త అనుభూతిని అందిస్తామన్నారు.
గిరిజన ప్రాంతాల్లో, ఇతర ప్రాంతాల్లో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆధ్వర్యంలో థీమ్ పార్క్‌లు, అడ్వెంచర్ యాక్టివిటీస్, ట్రెక్కింగ్ వంటి ఎకో-టూరిజం ప్రాజెక్టులను వేగంగా అభివృద్ధి చేస్తున్నామని తెలిపారు. తద్వారా యువతకు పెద్దపీట వేస్తూ ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నామన్నారు.
కార్యక్రమంలో భాగంగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నాయకత్వంలో ఏపీ పంచాయతీరాజ్ శాఖ దేశంలోనే నంబర్-1 స్థానంలో నిలిచిందని కొనియాడారు. గ్రామీణ ఆంధ్రప్రదేశ్‌ను స్వర్గధామంగా తీర్చిదిద్దిన తీరుపై ప్రశంసల జల్లు కురిపించారు.

“ఏపీకి రండి.. ఏపీలో పర్యాటక పెట్టుబడులకు అపార అవకాశాలు ఉన్నాయి..పరిశ్రమలతో సమానంగా రాయితీలు అందిస్తాం.. సులభతర భూ కేటాయింపులు,వేగవంతమైన అనుమతులు లభించే ఆంధ్రప్రదేశ్ పర్యాటక రంగంలో పెట్టుబడులు పెట్టండి.
మీ పెట్టుబడులకు పూర్తి భరోసా కల్పించే బాధ్యత కూటమి ప్రభుత్వానిది. త్వరలోనే ‘పర్యాటకాంధ్రప్రదేశ్’ కలను సాకారం చేసి, ఏపీని ప్రపంచ స్థాయి టూరిజం హబ్‌గా తీర్చిదిద్దుతాం.” అని మంత్రి కందుల దుర్గేష్ ఇన్వెస్టర్లకు పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో రాజ్యసభ సభ్యులు సానా సతీష్, లోక్‌సభ సభ్యులు ఉదయ్ శ్రీనివాస్, హరీష్, రాష్ట్ర మంత్రులు టీజీ భరత్, బి.సి. జనార్ధన్ రెడ్డి, సీఐఐ వైస్ ఛైర్మన్ జి. సాంబశివరావు, జేఎన్టీయూ వైస్ ఛాన్స్లర్ సీఎస్ఆర్ కే ప్రసాద్, పలువురు ప్రముఖ పారిశ్రామికవేత్తలు, అధికారులు పాల్గొన్నారు.