
అమరావతి : ఆర్నబ్ తుఫాను తీవ్రత దృష్టిలో ఉంచుకుని ప్రజలు ప్రభుత్వ సూచనలు పాటిస్తూ సురక్షితంగా ఉండాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సూచించారు.
తుఫాను ప్రభావంతో శ్రీకాకుళం నుంచి కృష్ణా జిల్లా వరకూ మోస్తారు నుంచి భారీ వర్షాలకు ఆస్కారం ఉందని.. తీరప్రాంతాల్లో భారీ ఈదురు గాలులు కూడా వీయవచ్చని సీఎం తెలిపారు. తుఫాను కారణంగా నష్ట తీవ్రతను తగ్గించేందుకు ప్రభుత్వ యంత్రాంగం సిద్ధంగా ఉందని వెల్లడించారు.
ఎన్నికల పనుల్లో బిజీగా ఉన్నప్పటికీ నిరంతరం తుపాను సన్నద్ధతపై జిల్లా కలెక్టర్లు, ఇతర ప్రభుత్వ యంత్రాంగంతో సీఎం ప్రతీ గంటకూ సమీక్ష నిర్వహించారు. మీడియా సమావేశంలో ముఖ్యమంత్రి మాట్లాడుతూ…”ప్రాణ, ఆస్తి నష్టం జరగకుండా మేం ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నాం.
ఆర్నబ్ తుపాను రెడ్ కేటగిరీలో ఉంది. అయినా ప్రజలు ఎవరూ భయపడాల్సిన పనిలేదు. శ్రీకాకుళం నుంచి బాపట్ల వరకూ తుపాను ప్రభావం ఉంటుంది. పశ్చిమగోదావరి, కృష్ణా నుంచి శ్రీకాకుళం వరకూ ఎక్కువ వర్షాలు, గాలుల తీవ్రత ఉంటుంది.
కాకినాడ సమీపంలోని యానాం వద్ద తీరాన్ని దాటే అవకాశం ఉంటుంది.తుపాను ప్రభావంతో వర్షాలు ఈ ఉదయం నుంచి ఉత్తరాంధ్రలో ప్రారంభం అయ్యాయి.ఇవాళ రాత్రికి, రేపు కూడా వర్షపాతం తీరప్రాంతాల్లో నమోదు అవుతుంది.
కోనసీమ, ఏలూరు, పశ్చిమ గోదావరి, మన్యం, విజయనగరం, శ్రీకాకుళం, కాకినాడ తదితర ప్రాంతాల్లో నష్ట తీవ్రత ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. కొన్ని చోట్ల అతిభారీ వర్షాలు కురిసే సూచనలు ఉన్నాయి. శ్రీ
కాకుళంలో 30 సెంటిమీటర్ల, పశ్చిమగోదావరిలో 28, విశాఖ 23 సెంటిమీటర్ల మేర వర్షపాతం నమోదు అయ్యే అవకాశం ఉంది. చాలా చోట్ల 10 సెంటిమీటర్ల కంటే ఎక్కువ వర్షాపాతం నమోదు అవుతుంది. తీర ప్రాంత జిల్లాల్లో సముద్రపు నీరు లోతట్టు ప్రాంతాల్లోకి చొచ్చుకు వచ్చే అవకాశం ఉంది.
లోతట్టు ప్రాంతాలు, తీరప్రాంత ప్రజలు ప్రయాణాలు రద్దు చేసుకుని ఇళ్లలోనే సురక్షితంగా ఉండాలని కోరుతున్నాను. సముద్ర తీరగ్రామాలు, లంకలు, లోతట్టు ప్రాంతాల ప్రజలు తుపాను షెల్టర్లకు వెళ్లాలని విజ్ఞప్తి చేస్తున్నాం.” అని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు.
పూర్తిస్థాయి సన్నద్ధతతో యంత్రాంగం
“ప్రభుత్వానికి ప్రజల ప్రాణాలే ముఖ్యం. తుపాను ప్రభావంతో ఎక్కడా నష్టం జరగకుండా చర్యలు తీసుకున్నాం. 290 షెల్టర్లను ఏర్పాటు చేశాం. 84,396 మందిని షెల్టర్లకు తరలించాం.
రాష్ట్ర, జిల్లా స్థాయిలో కంట్రోల్ రూమ్ లు 24 గంటలూ పనిచేస్తున్నాయి. ప్రతీ గంటకూ తుఫాను హెచ్చరికల బులెటిన్ జారీ చేస్తున్నాం. నిరంతరం తుపాను పై సమీక్ష నిర్వహిస్తున్నాను.
తుపాను తీవ్రత ఉండే ప్రాంతాలకే అప్రమత్తతా హెచ్చరికలు జారీ చేశాం. ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్, నౌకాదళం, కోస్టు గార్డును కూడా అప్రమత్తం చేశాం. వీలైనంత మేర ఆస్తి ప్రాణ నష్టాన్ని తగ్గించాలన్న లక్ష్యంతో పనిచేస్తున్నాం.
మత్స్యకారులకు చెందిన 30 వేల పైచిలుకు బోట్లను సముద్రం నుంచి వెనక్కు రప్పించాం. గోపాల్ పూర్ లో కూడా ఏపీకి చెందిన 93 బోట్లు వాటి సిబ్బంది సురక్షితంగా ఉన్నారు. అత్యవసర వైద్య చికిత్సల కోసం వాహనాలు అంబులెన్సులు సిద్ధం చేశాం.
5 వేల మంది గర్భిణులను ఇప్పటికే ప్రాథమిక, సామాజిక ఆరోగ్య కేంద్రాలు, సమీప ఆస్పత్రులకు తరలించాం. సురక్షిత మైన తాగునీరు అందించేలా ట్యాంకర్లు, జనరేటర్లను సిద్ధం చేశాం. విద్యుత్ అంతరాయం వస్తే తక్షణం స్పందించేందుకు 8400 మందిని సిద్ధం చేసుకున్నాం.
తుపాను ప్రభావంతో 15 వేల వరకూ స్తంభాలు పడిపోయే అవకాశం ఉందని అంచనా వేసి దానికి అనుగుణంగా ఏర్పాట్లు చేస్తున్నాం. తుఫాను కారణంగా కురిసే భారీ వర్షాలకు ఉత్తర కోస్తాంధ్రలోని నాగావళి, వంశధారలకు వరద వచ్చే అవకాశం ఉంది.
అలాగే వివిధ జిల్లాల్లో వాగులు వంకల్లో వరద నీటి ప్రవాహాలను అంచనా వేయటంతో పాటు చెరువులకు గండ్లు పడినా వెంటనే పునరుద్ధరించేలా చర్యలు చేపట్టాం. “అని ముఖ్యమంత్రి వివరించారు.
ఎప్పటికప్పుడు క్షేత్రస్థాయిలో అప్రమత్తం
“ముంపు గ్రామాల్లో ఆహారం, ఔషధాలు సరఫరా చేసేందుకు డ్రోన్లను వినియోగిస్తున్నాం. 7.16 లక్షల హెక్టార్ల మేర వ్యవసాయ పంటలు, 16 లక్షల ఉద్యాన పంటలు ప్రభావితం అయ్యే అవకాశం ఉంది.
అంగన్వాడీల నుంచి పిల్లలకు, బాలింతలకు, రేషన్ పంపించేలా కూడా ఏర్పాట్లు చేశాం. క్యాచ్ మెంట్ ఏరియాలో పడే వర్షపు నీటిని రిజర్వాయర్లలో నింపేలా కూడా చర్యలు తీసుకున్నాం.
తుఫాను కారణంగా నష్ట ప్రభావాన్ని సాంకేతికత ఆధారంగా అంచనా వేసి నష్ట నివారణ చర్యలు చేపట్టాం. ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని కోరుతున్నాను. గతంలో బుడమేరు వరద సమయంలో నేను విజయవాడ కలెక్టరేట్ లోనే ఉండి పనులు పర్యవేక్షించాను.
ప్రాణ, ఆస్తినష్టం వీలైనంత మేర తగ్గించటమే లక్ష్యంగా ఈ ముందస్తు జాగ్రత్తలు తీసుకున్నాం. సముద్ర తీర ప్రాంత గ్రామాల ప్రజలు మరింత సురక్షితంగా ఉండాలని విజ్ఞప్తి చేస్తున్నాను. నీటి ప్రవాహాల వైపు వెళ్లవద్దని హెచ్చరికలు జారీ చేస్తున్నాం.
తీవ్ర తుపానుపై ఇవాళ రాత్రి కూడా నిరంతరం క్షేత్రస్థాయిలో కలెక్టర్లతో సమీక్ష నిర్వహిస్తాం. హుద్ హుద్ కంటే తీవ్రత తక్కువ ఉన్నట్టుగా అంచనా వేస్తున్నాం. ప్రజలంతా సురక్షితంగా ఇళ్లకే పరిమితం కావాలని పదేపదే విజ్ఞప్తి చేస్తున్నాం.
తీరప్రాంతాలు, ముంపు ప్రాంతాల ప్రజలు తుపాను షెల్టర్లకు తరలి వెళ్లాలని కోరుతున్నాం. గాలులు, భారీ వర్షాల కారణంగా ప్రయాణాలు కూడా వాయిదా వేసుకోవాలని సూచిస్తున్నాం. గతంలో హుద్ హుద్ సమయంలో రెస్టోరేషన్ కు తీవ్రంగా శ్రమించాం.
రాష్ట్ర ప్రజలు ఎవరూ అధైర్య పడాల్సిన అవసరం లేదు. ప్రభుత్వం పూర్తి సన్నద్ధతతో ఉంది.” యుద్ధ ప్రాతిపదికన పనులు చేపట్టేలా నిరంతరం సమీక్ష చేస్తున్నట్టు ముఖ్యమంత్రి వివరించారు.