6కోట్ల లఖ్‌పతి దీదీల తయారు లక్ష్యం

అమరావతి : దేశంలో 6 కోట్ల మంది లఖ్‌పతి దీదీలను తయారుచేయడమే ప్రధాని నరేంద్ర మోదీ ఆలోచన అని, ఇప్పటికే దాదాపు 3.5 కోట్ల మంది ఈ స్థాయికి చేరారని కేంద్ర గ్రామీణాభివృద్ధి, కమ్యూనికేషన్ల శాఖ సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ తెలిపారు. కేవలం లఖ్‌పతి దీదీలను సృష్టించడమే కాకుండా, ఒక్కో మహిళా పారిశ్రామికవేత్త రూ.10 లక్షలు లేదా అంతకంటే ఎక్కువ సంపాదించేలా ప్రోత్సహించడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని స్పష్టం చేశారు. మహిళా ఉత్పత్తులకు విస్తృత విపణి కల్పించేలా ఢిల్లీకే పరిమితమైన జాతీయ సరస్ మేళాను మొదటిసారిగా విజయవాడలో నిర్వహించడం విశేషమని, ఈ సదస్సు ద్వారా సమాజంలో మరింత లోతైన మార్పు వస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.