వర్షంలో తడుస్తూ వరదను పరిశీలించిన కందుల దుర్గేష్

నిడదవోలు : భారీ వర్షాల నేపథ్యంలో నిడదవోలు నియోజకవర్గంలో పలు ప్రాంతాల్లో క్షేత్రస్థాయిలో పర్యటించి, వర్షపు నీరు నిలిచిపోతున్న చోట రాకపోకలకు ఏర్పడుతున్న ఇబ్బందులు, ముందస్తు రక్షణ చర్యలను పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ పరిశీలించారు. ఒకవైపు ముంపు వరద, మరోవైపు వర్షం కురుస్తుండగా మంత్రి క్షేత్రస్థాయిలో పర్యటించి, అప్పటికప్పుడు పరిస్థితికి అనుగుణంగా అధికారుల నుఆదేశించారు. నిడదవోలు బస్టాండ్, తిమ్మరాజుపాలెం, కోటసత్తెమ్మ గుడి రోడ్డు, కంసాలిపాలెం తదితర ప్రాంతాల్లో పరిస్థితులను స్వయంగా పరిశీలించి అధికారులతో సమీక్షించారు.బస్టాండ్ ప్రాంతంలో నిలిచిన వర్షపు నీటిని వెంటనే తొలగించడంతో పాటు, ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అవసరమైన చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు.కంసాలిపాలెం– మాధవరం మధ్య నీటి ఉధృతి పెరుగుతున్న నేపథ్యంలో ఎమ్మార్వో, ఆర్డీవోలను అప్రమత్తం చేసి ప్రమాద హెచ్చరిక బోర్డులు, బారికేడ్లు ఏర్పాటు చేయించారు.విద్యుత్ తీగలు వేలాడుతున్న ప్రాంతాల్లో కూడా ఎలాంటి ప్రాణనష్టం జరగకుండా తక్షణ చర్యలు చేపట్టాలని విద్యుత్ శాఖ అధికారులను ఆదేశించారు.బస్టాండ్ వద్ద డ్రైనేజీ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపేందుకు డ్రైన్ నిర్మాణానికి ప్రతిపాదనలు పంపించామని మంత్రి వెల్లడించారు.ప్రస్తుత వర్షాల పరిస్థితుల్లో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.అత్యవసర పరిస్థితుల్లో అధికారులకు సమాచారం అందించాలన్నారు.ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు,ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నాయకత్వంలో నియోజకవర్గంలోని అన్ని సమస్యలను త్వరితగతిన పరిష్కరిస్తామని మంత్రి దుర్గేష్ పేర్కొన్నారు.