
తాడేపల్లి : 2019 ఎన్నికల సమయంలో అనేకమంది నాయకులు మంగళగిరి ప్రజల ఇంటిపట్టాల సమస్యపై హామీ ఇవ్వాలని నన్ను కోరారు.
ఆనాడు సమస్య అర్థం కాకపోవడంతో నేను హామీ ఇవ్వలేకపోయా. గత ఎన్నికల్లో గడపగడపకు వచ్చినపుడు దశాబ్ధాలుగా ఇక్కడే జీవిస్తున్న వారితో మాట్లాడాక సమస్య అర్థమైంది. సొంత ఇల్లు ఒక ఎమోషన్.
కుటుంబమంతా చెమటోడ్చి కష్టపడి ఇల్లు కట్టుకున్నారు. అధికారులు, రాజకీయ నాయకులు ఆ ఇల్లు మీది కాదు, రేపు మాపో ఇక్కడ నుంచి వెళ్లిపోవాలని ప్రతిక్షణం భయపెట్టే పరిస్థితి ఆనాడు ఉండేది.
దానికి ఫుల్ స్టాప్ పెట్టేందుకే ఆనాడు నేను హామీ ఇచ్చారు. మూడోవిడత సుమారు 400 మందికి శాశ్వత పట్టాలు కల్పిస్తున్నది మీ కూటమి ప్రభుత్వం.
బట్టలు పెట్టి పసుపు,కుంకుమలతో పట్టాలు ఇస్తానని ఆనాడు ఇచ్చిన హామీ ఈరోజు నిలబెట్టుకుంటున్నా. మొదటి విడతలో 3,002, రెండోవిడతలో 2,670, మూడోవిడతలో 388 పట్టాలు కలిపి మొత్తం సుమారు రూ.2వేల కోట్ల విలువ ఆస్తికి ప్రజలకు శాశ్వత హక్కులు కల్పించింది ప్రజాప్రభుత్వం.
రాష్ట్రానికి దిక్సూచిగా మంగళగిరి మోడల్ :
మంగళగిరి మొదటిపెట్టిన ప్రక్రియ ఈరోజు యావత్ రాష్ట్రవ్యాప్తంగా అమలవుతోంది. మంగళగిరిలో పట్టాల సమస్యను నేను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లినపుడు ఆంధ్రప్రదేశ్ లో ఈ సమస్య ఎక్కడున్నా పరిష్కరించాల్సి ఉందని ఆయన నాతో చెప్పారు.
అధికారులు, నాయకుల కనీసం ఒక్క గ్లాసు మంచినీరు కూడా తీసుకోకుండా ఇళ్లకు వెళ్లి వివరాలు తీసుకున్నారు. ప్రజల సమస్యలు పరిష్కరించేందుకు మేమంతా ఒక పట్టుదల, కమిట్ మెంట్ తో పనిచేస్తున్నాం.
మంగళగిరిలో వేసిన పునాది ఆంధ్ర రాష్ట్రానికి దిక్సూచిగా మారింది. ఇటీవల విశాఖపట్నంలో 29వేల పట్టాలను ప్రజాప్రభుత్వం ప్రజలకు అందించింది.
త్వరలో విజయవాడలో కూడా మరో 24వేలమందికి అందించబోతోంది. ఇది గౌరవ ముఖ్యమంత్రి గారికి పేదల పట్ల ఉన్న కమిట్ మెంట్ అని మంత్రి నారా లోకేష్ ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమంలో ప్రజల హర్షద్వానాల మధ్య స్పష్టం చేశారు.