గ్లోబల్ హార్టికల్చర్ హబ్ గా రాయలసీమ

అమరావతి : రాయలసీమ ప్రాంతాన్ని ఫ్రూట్ బౌల్ గా తీర్చిదిద్దేలా గ్లోబల్ హార్టికల్చర్ హబ్‌కు కూటమి ప్రభుత్వం శ్రీకారం చుట్టనుంది. విత్తనం నుంచి విదేశాలకు ఉద్యాన ఉత్పత్తులు ఎగుమతి చేసే వరకు రైతులకు అండగా నిలిచేలా ప్రణాళికాబద్దంగా గ్లోబల్ హార్టికల్చర్ హబ్ ప్రాజెక్టుకు కూటమి ప్రభుత్వం రూపకల్పన చేసింది. అన్నమయ్య జిల్లా మదనపల్లెలో కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ తో కలిసి సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ లు హార్టీకల్చర్ హబ్ కు శ్రీకారం చుట్టనున్నారు. రూ.1 లక్ష కోట్ల వ్యయంతో మూడు దశల్లో గ్లోబల్ హార్టికల్చర్ హబ్ ఆవిష్కృతమయ్యేలా పనులు చేపట్టనున్నారు.

ఇందులో ఎన్డీఏ ప్రభుత్వం రూ.40,352 కోట్లు సమకూరుస్తుండగా, ప్రైవేట్ రంగం నుంచి రూ.60,000 కోట్లు పెట్టుబడులు రాబట్టేలా ప్రణాళికలు రూపొందించారు. అనంతపురం, అన్నమయ్య, చిత్తూరు, కర్నూలు, నంద్యాల, సత్యసాయి, తిరుపతి, కడప, ప్రకాశం, మార్కాపురం జిల్లాల్లో ఈ ప్రాజెక్టు కింద వివిధ పనులను చేపట్టనున్నారు. 10 జిల్లాల పరిధిలోని మొత్తం 303 మండలాలు, 5,869 గ్రామాల్లో 201 క్లస్టర్ల ద్వారా అభివృద్ధి పనులు జరిగేలా ప్రణాళికలను సిద్దం చేశారు.

ప్రస్తుతం 8.41 లక్షల హెక్టార్లలో ఉన్న ఉద్యాన సాగును మరో 6 లక్షల హెక్టార్లు విస్తరించి 14.41 లక్షల హెక్టార్లకు చేర్చనున్నారు. ఉత్పత్తి సామర్థ్యాన్ని ప్రస్తుతం 222 లక్షల మెట్రిక్ టన్నుల నుంచి 435 లక్షల మెట్రిక్ టన్నులకు పెంచే లక్ష్యాన్ని నిర్దేశించుకుని ప్రాజెక్టు కోసం పని చేయనున్నారు దీని ద్వారా సుమారు 9.6 లక్షల మంది రైతులకు ప్రత్యక్ష ప్రయోజనం చేకూరనుంది. కొత్తగా 9 లక్షల ఎకరాల ఆయకట్టును సాగులోకి తీసుకురావటంతో పాటు , 4.3 లక్షల ఎకరాలను స్థిరీకరించనున్నారు.

ప్రభుత్వం వెచ్చించే రూ.40,352 కోట్లలో ఇరిగేషన్‌ ప్రాజెక్టులకు రూ.20,884 కోట్లు, ఉద్యాన అభివృద్ధికి రూ.15 వేల కోట్లు, రహదారులకు రూ.4,562 కోట్లుగా విభజించుకుని ప్రణాళిక బద్దంగా ప్రాజెక్టును అమలు చేయనున్నారు. దీంట్లో భాగంగా భారీ ఎత్తున ఇరిగేషన్ ప్రాజెక్టులు, డ్రిప్ ఇరిగేషన్, రహదారులు, లాజిస్టిక్స్ వంటి అభివృద్ధి పనులు చేపట్టనున్నారు. రైస్ బౌల్‌గా పేరొందిన ఆంధ్రప్రదేశ్‌కు ఫ్రూట్ బౌల్ కీర్తి సాధించేలా గ్లోబల్ హార్టికల్చర్ హబ్ ప్రణాళిక రూపొందింది.

మామిడి, అరటి, టమాటా, దానిమ్మ, డ్రాగన్ ఫ్రూట్, అవకాడో, బెర్రీలు వంటి పంటలకు ప్రోత్సాహం ఇస్తూ ఫుడ్ ప్రాసెసింగ్ ప్లాంట్లు, ఎగుమతులకు ప్రైవేట్ రంగంలో పెట్టుబడులు రాబట్టేలా చర్యలు చేపట్టనున్నారు. గ్లోబల్ హార్టికల్చర్ హబ్ అమలు కోసం దాదాపు ఆరు నెలలుగా పెద్ద ఎత్తున కసరత్తు చేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు ..వ్యవసాయ, ఉద్యాన, ఆర్థిక, ఇరిగేషన్ శాఖలతో నిరంతరం సమీక్షలు నిర్వహించారు. కేంద్రంతో సంప్రదింపులు జరిపి ఈ ప్రాజెక్టును సాకారం చేసుకున్నారు. రాయలసీమ రైజింగ్‌లో భాగంగా ఉద్యాన వెలుగులు నింపేలా గ్లోబల్ హార్టికల్చర్ హబ్ రూపుదిద్దుకుంటోంది.

మదనపల్లెలో భారతదేశ తొలి ఇండియన్ స్కూల్ ఆఫ్ అగ్రికల్చర్ :

వ్యవసాయ, అనుబంధ రంగాలను లాభసాటిగా తీర్చిదిద్దేందుకు సరికొత్త వ్యవస్థ ఏర్పాటుకు వేదిక కానున్న ఆంధ్రప్రదేశ్. మదనపల్లెలో ఇండియన్ స్కూల్ ఆఫ్ అగ్రికల్చర్ ఏర్పాటుకు కేంద్ర ఆర్థిక మంత్రి, సీఎం, డిప్యూటీ సీఎంలు శంకుస్థాపన చేయనున్నారు. పారిశ్రామికాభివృద్ధికి ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ తరహాలో వ్యవసాయాభివృద్ధికి ఈ సంస్థ ఏర్పాటు కానుంది. సీఎం చంద్రబాబు సూచనలతో ఈ స్కూల్ ఏర్పాటు, నిర్వహణకు ప్రభుత్వంతో కలిసి పని చేసేందుకు రిలయన్స్ సంస్థ ముందుకు వచ్చింది.

వ్యవసాయ రంగంలోని సవాళ్లకు పరిష్కారం చూపేలా రైతులకు టెక్నాలజీ ఆధారిత సలహాలు అందించనున్న ఈ స్కూల్…ఆధునిక సాంకేతికత, శాస్త్రీయ అధ్యయనం, డిజిటల్ అగ్రికల్చర్, ప్రెసిషన్ ఫార్మింగ్, క్రాప్ మానిటరింగ్, స్మార్ట్ ఇరిగేషన్, మార్కెట్ ఇంటెలిజెన్స్ వంటి అంశాలపై దృష్టి సారించనుంది. అగ్రిసైన్స్, డిజిటిల్ టెక్నాలజీ, ఏఐ, క్లైమేట్ సైన్స్, అగ్రిబిజినెస్, ప్రాసెసింగ్, మార్కెట్ ఇంటెలిజెన్స్ సహా వివిధ అంశాల్లో ఐఎస్ఏ ద్వారా సేవలు అందుతాయి.

డేటా డ్రివెన్ ప్రిడిక్టివ్ అగ్రికల్చర్ ద్వారా సంప్రదాయ వ్యవసాయాన్ని ఆధునీకరించేలా ఐఎస్ఏ సేవలు అందించనుంది. ఉద్యాన, వ్యవసాయ రంగాల్లో డిమాండ్ ఆధారిత పంటలను సాగు చేసేలా రైతులకు ఐఎస్ఏ నుంచి ఎప్పటికప్పుడు సూచనలు సలహాలు స్కూల్ ఆఫ్ అగ్రికల్చర్ అందిస్తుంది. వ్యాల్యూచైన్, ధరలు, కార్పోరేట్ సంస్థలు, వ్యవస్థీకృత మార్కెట్లకు రైతులను, ఎఫ్ పీఓలను అనుసంధానించేలా ఐఎస్ఏ సేవలు అందిస్తుంది. వ్యవసాయరంగంలో స్టార్టప్ లకు ప్రోత్సాహంతో పాటు ఇంక్యుబేషన్ సెంటర్లను ఇండియన్ స్కూల్ ఆఫ్ అగ్రికల్చర్ అభివృద్ధి చేస్తుంది.