
అమరావతి : సొంత బాబాయ్ వైఎస్ వివేకానందరెడ్డి దారుణ హత్య కేసులో దర్యాప్తు సంస్థలన్నీ ఆధారాలతో సహా తాడేపల్లి ప్యాలెస్ వైపే వేలెత్తి చూపుతున్నా జగన్మోహన్ రెడ్డి నోరు మెదపకపోవడం ముమ్మాటికీ నేరాన్ని అంగీకరించడమేనని రాష్ట్ర రవాణా, యువజన, క్రీడా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.
నేడు మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ…
కడప ఎంపీ టికెట్ కోసం ఏకంగా ₹40 కోట్ల భారీ సుపారీ కుమ్మరించి సొంత కుటుంబాన్నే బలితీసుకున్న చరిత్ర జగన్‌ది కాదా అని సూటిగా ప్రశ్నించారు.
ఈడీ, సీబీఐ దర్యాప్తు సంస్థలు వేగంగా వాస్తవాలను వెలికితీస్తుంటే సమాధానం చెప్పలేక జగన్ మొహం చాటేస్తున్నారని మండిపడ్డారు.
ముఖ్యమంత్రి పదవిని అడ్డం పెట్టుకుని ఐదేళ్ల పాటు ఈ కేసును నీరుగార్చారని, పులివెందులలోకి కేంద్ర దర్యాప్తు అధికారులు అడుగుపెట్టకుండా అడ్డుకున్న చరిత్ర వైసీపీ ప్రభుత్వానిదేనని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఒకవైపు గొడ్డలి పార్టీ విధ్వంసకర రాజకీయాలు చేస్తుంటే, మరోవైపు కూటమి ప్రభుత్వం ప్రజల సంక్షేమం, అభివృద్ధిని పరుగులు పెట్టిస్తోందని మంత్రి పేర్కొన్నారు.
ప్రొద్దుటూరు వేదికగా సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ₹61.60 లక్షల కొళాయిలతో 27.36 లక్షల కుటుంబాలకు తాగునీరు అందించే ‘జలజీవన్ మిషన్’ బృహత్తర కార్యక్రమానికి శ్రీకారం చుట్టారని తెలిపారు.
పల్లె పండుగ 3.0 కింద ₹1,185 కోట్లతో సీసీ, బీటీ రోడ్లు, మినీ గోకులాలు, మ్యాజిక్ డ్రైన్ల పనులు ముమ్మరంగా సాగుతున్నాయన్నారు.
పీఎంఏవై గ్రామీణ్ 2.0 ద్వారా రాష్ట్రంలో ₹7,170 కోట్లతో పేదలకు మూడు లక్షల పక్కా ఇళ్ల నిర్మాణం చేపడుతున్నామని స్పష్టం చేశారు.
నాడు వైసీపీ హయాంలో పేదలకు సెంటున్నర స్థలం పేరుతో భూదందాలు చేశారని, కూటమి ప్రభుత్వంలో మాత్రం పారదర్శకంగా సంక్షేమ పథకాలను లబ్ధిదారులకు అందిస్తున్నామని వివరించారు.
రాయలసీమ సాగునీటి కష్టాలను తీర్చడానికి ఎన్టీఆర్ హంద్రీ-నీవా ప్రాజెక్టుకు శంకుస్థాపన చేస్తే, చంద్రబాబు నాయుడు నాలుగు పర్యాయాల్లోనూ నిధులు కేటాయించి కుప్పం వరకు కృష్ణా జలాలను తరలించి చూపించారని కొనియాడారు.
రాయలసీమతో పాటు ప్రకాశం జిల్లాను కలుపుకుని పది జిల్లాలను ‘హార్టికల్చర్ హబ్’గా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం కార్యాచరణ సిద్ధం చేసిందన్నారు.
హైదరాబాద్‌లో ఐఎస్బీని ఏర్పాటు చేసినట్లే, నారా లోకేష్ చొరవతో మూడో తరం అంబానీలతో చర్చించి దేశంలోనే తొలిసారిగా ‘ఇండియన్ స్కూల్ ఆఫ్ అగ్రికల్చర్’ను తీసుకొస్తున్నామని గర్వంగా వెల్లడించారు.
తెలుగుదేశం పార్టీ బీసీలకు ఎల్లప్పుడూ వెన్నెముకగా నిలుస్తుందని, రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు అమలు చేయడంతో పాటు అధిక స్థానాలను కేటాయించేందుకు కట్టుబడి ఉన్నామని రాంప్రసాద్ రెడ్డి స్పష్టం చేశారు.
గత వైసీపీ పాలనలో దౌర్జన్యాలు, బెదిరింపులతో స్థానిక సంస్థలను కైవసం చేసుకున్నారని, ఇప్పుడు మాత్రం చట్టబద్ధంగా, ఎన్నికల కమిషన్ నిబంధనల ప్రకారం పారదర్శక ఎన్నికలు జరగబోతున్నాయని తెలిపారు.
గడిచిన రెండున్నరేళ్ల కూటమి సుపరిపాలన, అభివృద్ధి, శాంతిభద్రతలే తమకు శ్రీరామరక్ష అని, స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి ప్రభంజనం సృష్టించి చంద్రబాబు గారికి ఘన విజయాన్ని కానుకగా అందిస్తామని మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు.