తక్కువ పెట్టుబడితో అధిక లాభాలే లక్ష్యం- అచ్చెన్న 

బాపట్ల : రైతులకు తక్కువ పెట్టుబడితో అధిక లాభాలు అందించడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని రాష్ట్ర వ్యవసాయ, సహకార, మార్కెటింగ్‌, పశుసంవర్ధక, పాడి అభివృద్ధి, మత్స్యశాఖల మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు అన్నారు.

ఆధునిక వ్యవసాయ పద్ధతులు, యాంత్రీకరణ, కృత్రిమ మేధ ఆధారిత సేవలు, పంటలకు విలువ జోడింపును సమన్వయం చేసి రైతులకు సాగును లాభసాటిగా మార్చేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని తెలిపారు.

సాధారణ రైతులు, చదువుకోని రైతులు సైతం సులభంగా సలహాలు, సహాయ సహకారాలు పొందగలిగేలా సాంకేతికతను అందుబాటులోకి తీసుకురావాలని పేర్కొన్నారు.

ఆచార్య ఎన్.జి. రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో బాపట్లలో నూతనంగా ఏర్పాటైన సెంటర్‌ ఆఫ్‌ ఎక్సలెన్స్‌ ఇన్‌ పోస్ట్‌-హార్వెస్ట్‌ ఇంజనీరింగ్‌ అండ్‌ టెక్నాలజీ (CEPHET–సీఫెట్‌) ప్రధాన భవనాన్ని, వ్యవసాయ యంత్ర పరికరాల వర్క్‌షాప్‌, శిక్షణ కేంద్రాన్ని సోమవారం మంత్రి ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు.

సీఫెట్‌ ప్రధాన భవనం, వర్క్‌షాప్‌, శిక్షణ కేంద్రంలోని సౌకర్యాలను పరిశీలించారు.

ఇంక్యుబేషన్‌ సెంటర్‌ను, ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ఫార్మ్‌ మెషినరీ అండ్‌ ఇంప్లిమెంట్స్‌, పోస్ట్‌ హార్వెస్ట్‌ టెక్నాలజీ ఎగ్జిబిషన్‌ను సందర్శించారు.

అనంతరం బాపట్ల వ్యవసాయ కళాశాల ఆడిటోరియంలో నిర్వహించిన సమావేశంలో ప్రసంగించారు.

ఈ సందర్భంగా ‘ఏఎన్‌జీఆర్‌ఏయూ ఇన్నోవేటివ్‌ కిసాన్‌ నెట్‌వర్క్‌’గా రూపొందించిన ఆంగ్రూ వినూత్న రైతుల నెట్‌వర్క్‌ (AIKN)ను మంత్రి ప్రారంభించి, దానికి ‘రైతు కోసం’ అని నామకరణం చేశారు.

రైతులకు వ్యవసాయ సలహాలు, సహాయ సహకారాలను సులభంగా అందించేందుకు ‘రైతు కోసం’ యాప్‌ను ప్రారంభించినట్లు తెలిపారు.

‘రైతు మిత్ర సలహావాణి’ ఆర్‌ఐఏఏ (RIAA) కృత్రిమ మేధ ఆధారిత వాయిస్‌ ఏజెంట్‌ను, ‘అగ్రికల్చర్‌ బియాండ్‌ ఫార్మింగ్‌’ పుస్తకాన్ని కూడా ఆవిష్కరించారు.

ఈ సందర్భంగా మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు మాట్లాడుతూ ఒకే పట్టణంలో వ్యవసాయ రంగానికి సంబంధించిన మూడు కీలక కళాశాలలు ఉండటం బాపట్లకు గర్వకారణమని మంత్రి పేర్కొన్నారు.

వ్యవసాయ కళాశాల ద్వారా నాణ్యమైన విత్తనాలు, నేల సారం, చీడపీడల నివారణ, ఆధునిక వంగడాలు, అధిక దిగుబడులపై శాస్త్రవేత్తలు రైతులకు సలహాలు అందిస్తున్నారని వివరించారు.

డాక్టర్‌ ఎన్టీఆర్‌ వ్యవసాయ ఇంజనీరింగ్‌ కళాశాల విత్తనం వేసే దశ నుంచి పంట కోత వరకు సాంకేతికత, యాంత్రీకరణ, ఆధునిక పరికరాల రూపకల్పనలో తోడ్పడుతోందన్నారు.

డాక్టర్‌ ఎన్టీఆర్‌ ఫుడ్‌ సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ కళాశాల రైతులు పండించిన పంటలను నేరుగా విక్రయించడానికే పరిమితం కాకుండా, వాటికి విలువ జోడించి మార్కెట్‌ చేసుకునేందుకు సహకరిస్తోందని తెలిపారు.

ఈ మూడు విభాగాల అనుసంధానంతో రైతులకు ప్రయోజనం చేకూర్చాలని సూచించారు.

మారుతున్న ఆహార అలవాట్లకు అనుగుణంగా పంటలను, వంగడాలను అభివృద్ధి చేయాలని మంత్రి శాస్త్రవేత్తలకు సూచించారు.

పాత పద్ధతుల్లోనే వ్యవసాయం కొనసాగిస్తే రైతులు నష్టపోయే పరిస్థితులు ఉంటాయని పేర్కొన్నారు.

ప్రస్తుతం మార్కెట్‌లో డిమాండ్‌ ఉన్న ప్రాధాన్య వంగడాల (Preferred Varieties)పై ప్రత్యేక దృష్టి సారించి, రైతులకు ఆర్థిక లబ్ధి చేకూరేలా చూడాలని చెప్పారు.

ఆయా వంగడాలను అందుబాటులోకి తీసుకువచ్చి, వాటి సాగుకు రైతులను ప్రోత్సహించాల్సిన అవసరం ఉందని తెలిపారు.

యాంత్రీకరణ, కృత్రిమ మేధపై దృష్టి సారించి రైతుల సమస్యలకు పరిష్కారాలు చూపే ఆవిష్కరణలు చేయాలని మంత్రి పిలుపునిచ్చారు.

విశ్వవిద్యాలయం మంచి పరిశోధనలు చేస్తోందని ప్రశంసించారు. పరిశోధనలు, నూతన ఆవిష్కరణల అభివృద్ధికి విశ్వవిద్యాలయ ఉపకులపతికి, శాస్త్రవేత్తలకు ప్రభుత్వం తరఫున పూర్తి ప్రోత్సాహం, సహాయ సహకారాలు అందిస్తామని హామీ ఇచ్చారు.

ఆధార్‌ లేదా గుర్తింపు వివరాలతో సమస్యను తెలియజేస్తే పరిష్కారాన్ని పొందగలిగే స్థాయికి ఆధునిక సాంకేతికత, కృత్రిమ మేధ అభివృద్ధి చెందాయని మంత్రి వ్యాఖ్యానించారు. ఈ అవకాశాలను వ్యవసాయ రంగంలో ఉపయోగించుకోవాలని సూచించారు.

గత ఐదేళ్లలో నిర్వీర్యమైన వ్యవసాయ, నీటిపారుదల రంగాలకు తమ ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందన్నారు.

ఉచిత విత్తనాల పంపిణీ, సకాలంలో విత్తనాల సరఫరా, భూసార పరీక్షలు, వ్యవసాయ యాంత్రీకరణ, విపత్తుల సమయంలో నష్టపరిహారం వంటి చర్యలతో రైతులకు అండగా నిలుస్తున్నామని తెలిపారు.

ఉద్యాన రంగ అభివృద్ధికి మదనపల్లెలో ప్రభుత్వ–ప్రైవేటు భాగస్వామ్యంతో రూ.1,00,000 కోట్ల ప్రాజెక్టును ప్రారంభించినట్లు మంత్రి పేర్కొన్నారు.

విద్యార్థులు తరగతి గదులకే పరిమితం కాకుండా నిరంతరం క్షేత్రస్థాయిలో ఉంటూ రైతులకు సలహాలు అందించాలన్నది ముఖ్యమంత్రి ఆకాంక్ష అని తెలిపారు.

81 ఏళ్ల సుదీర్ఘ చరిత్ర కలిగిన బాపట్ల వ్యవసాయ కళాశాల నుంచి ఎంతోమంది రాజకీయ నాయకులు, ఐఏఎస్‌, ఐపీఎస్‌ అధికారులు, వ్యాపారవేత్తలు ఎదిగారని కొనియాడారు.

సూపర్‌ ఎల్‌నినో ప్రభావంతో వర్షపాతం తగ్గినా నీటిని ఆదా చేసుకుంటూ సాగు కొనసాగించేలా సూక్ష్మ సాగునీటి విధానాలను ప్రోత్సహిస్తున్నామని, డ్రిప్‌, స్ప్రింక్లర్ల వినియోగాన్ని పెంచేందుకు చర్యలు చేపడుతున్నామని చెప్పారు.

ఈ సమావేశంలో బాపట్ల జిల్లా కలెక్టర్‌, జిల్లా మేజిస్ట్రేట్‌ డా. వి. వినోద్‌కుమార్‌, బాపట్ల శాసనసభ్యులు వేగేశన నరేంద్ర వర్మ రాజు, పరచూరు శాసనసభ్యులు వై. సాంబశివరావు, చీరాల శాసనసభ్యులు ఎం. మాలకొండయ్య యాదవ్‌, విశ్వవిద్యాలయ ఉపకులపతి డా. పి.వి. సత్యనారాయణ, బాపట్ల అర్బన్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీ చైర్మన్‌ సలగల రాజశేఖర్‌బాబు, ఆప్కో చైర్మన్‌ సజ్జా హేమలత, రైతులు, విద్యార్థులు, తదితరులు పాల్గొన్నారు.