డ్రైవర్ జెట్టి శివ త్యాగం చిరస్మరణీయం: మంత్రి మండిపల్లి

అమరావతి : అనకాపల్లి జిల్లాలో విధి నిర్వహణలో గుండెపోటుకు గురైనప్పటికీ, తన ప్రాణాల కంటే ప్రయాణికుల ప్రాణాలే ముఖ్యమని భావించి, చివరి క్షణాల్లోనూ బస్సును సురక్షితంగా నిలిపి 40 మంది ప్రయాణికుల ప్రాణాలను కాపాడిన ఏపీఎస్ఆర్టీసీ డ్రైవర్ జెట్టి శివ త్యాగం హృదయాన్ని కలచివేసిందని రాష్ట్ర రవాణా, యువజన, క్రీడాశాఖల మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేస్తూ తాడేపల్లి క్యాంపు కార్యాలయం నుండి ప్రకటన విడుదల చేశారు.

తీవ్ర అనారోగ్యంతో ప్రాణాలు పోతున్న పరిస్థితుల్లోనూ ప్రయాణికుల భద్రతకే ప్రాధాన్యతనిచ్చిన జెట్టి శివ విధి నిర్వహణ పట్ల చూపిన అంకితభావం, మానవత్వం మాటల్లో వర్ణించలేనివని మంత్రి కొనియాడారు.

తన ప్రాణాలను పణంగా పెట్టి 40 కుటుంబాల్లో విషాదం నిండకుండా కాపాడిన ఆయన సేవాస్ఫూర్తి ఎప్పటికీ స్ఫూర్తిదాయకంగా నిలుస్తుందని పేర్కొన్నారు.

జెట్టి శివ మృతి పట్ల మంత్రి తీవ్ర దిగ్భ్రాంతి, ప్రగాఢ సంతాపం వ్యక్తం చేస్తూ, ఆయన కుటుంబ సభ్యులకు హృదయపూర్వక సానుభూతి తెలిపారు.

కుటుంబానికి కలిగిన ఈ తీరని లోటు పూడ్చలేనిదని, ఈ కష్టకాలంలో ప్రభుత్వం, ఏపీఎస్ఆర్టీసీ కుటుంబానికి అండగా నిలిచి, నిబంధనల ప్రకారం తగిన సహాయ సహకారాలు అందించాలని ఆకాంక్షించారు. విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయినా, 40 మంది ప్రయాణికుల ప్రాణాలను కాపాడిన జెట్టి శివ త్యాగం ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోతుందని మంత్రి మండిపల్లి పేర్కొన్నారు.