“సీమ”లో చారిత్రాత్మక ఘట్టం ఆవిష్కృతం- నిర్మల సీతారామన్ 

మదనపల్లి : మదనపల్లెలో గ్లోబల్ హార్టీ కల్చర్ హబ్ అంకురార్పణ, ఇండియన్ స్కూల్ ఆఫ్ అగ్రికల్చర్ శంకుస్థాపన అనంతరం కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ ప్రసంగించారు.

స్వదేశీ-స్వరాజ్యం అన్న గాంధీజి, జై జవాన్- జైకిసాన్ అన్న లాల్ బహదూర్ శాస్త్రి జయంతిని పురస్కరించుకుని రాయలసీమలో చారిత్రాత్మక ఘట్టం ఆవిష్కృతం అవుతోంది.

రైతుల గురించి ఆ మహనీయులు ఆలోచన చేశారు. అటల్ బిహారీ వాజ్ పేయి లాంటి నేతలు బాటలు వేశారు.

అదే కోవలో ప్రధాని మోదీ కూడా కిసాన్ సమ్మాన్ నిధి, ఎరువుల కొరత లేకుండా చూస్తున్నారు. యుద్ధ సంక్షోభం ఉన్నా ఇబ్బందులు లేకుండా చూస్తున్నాం.

యూరియా బస్తా ధర అంతర్జాతీయంగా రూ.3వేలు ఖర్చు అవుతోంది. కానీ కేవలం రూ.3 వందలకే రైతులకు అందిస్తున్నాం.

ప్రతీ బస్తాకూ కేంద్రం రూ.2700 సబ్సీడీని భరిస్తోంది. వాతావరణాన్ని తట్టుకునేలా కొత్త వంగడాలు కూడా తీసుకువచ్చాం.

గోబర్ధన్ విధానం ద్వారా బయోగ్యాస్ ఉత్పత్తి చేసే వ్యవస్థను, పీఎం కుసుమ్ యోజన ద్వారా సోలార్ పంపుసెట్లు ఇస్తున్నాం.

రైతులకు పంట నష్టం రాకుండా కిసాన్ ఇన్సూరెన్స్ స్కీమ్ కూడా ప్రధాని మోదీ అమలు చేస్తున్నారు. రైతుల అవసరాలకు అనుగుణంగా ఆలోచన చేసి వివిధ పథకాలు అమలు అవుతున్నాయి.

ఆక్వా రైతులకు, పశువుల పెంపకానికి కూడా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా పథకాలు అందిస్తున్నాం. సాగు చేస్తున్న రైతులందరికీ మంచి ఆదాయం రావాలనే ఆలోచనతోనే ప్రధాని నిత్యం పనిచేస్తున్నారు.

కూటమి ప్రభుత్వానికి వేసిన ఒక్క ఓటుతోనే రాయలసీమలో హార్టీకల్చర్ హబ్ కు అంకురార్పణ జరుగుతోంది. మొత్తం ఏపీలోని పది జిల్లాలు ప్రపంచ ఉద్యాన కేంద్రంగా మార్చేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కృషి చేస్తున్నాయి.

సమర్ధ నీటి నిర్వహణ ద్వారా రైతులకు సాగునీరు ఇవ్వాలన్న ఆలోచన చేస్తున్నాం. రైతులకు సహకారం అందించేలా ఇండియన్ స్కూల్ ఆఫ్ అగ్రికల్చర్ రిలయన్స్ ఏర్పాటు చేస్తోంది.

ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ లాగే ఇండియన్ స్కూల్ ఆఫ్ అగ్రికల్చర్ మన రైతులకు సహకారం ఇస్తుంది. దేశానికి ఉపయోగపడేలా ఐఎస్ఏను ఏర్పాటు చేస్తున్న రిలయన్స్ సంస్థకు అభినందనలు తెలియచేస్తున్నాను.

నేను ఆంధ్రప్రదేశ్ కు కోడలిని, ఆడబిడ్డను కాదు. రాష్ట్రం గురించి నాకు ప్రేమ ఉంది. గుజరాత్ నుంచి వచ్చిన అనంత్ అంబానీ ఆంధ్రప్రదేశ్ బిడ్డగా నన్ను స్వీకరించాలని వినయంగా కోరారు.

సీఎం చంద్రబాబు కూడా ఆయన్ను ఏపీ బిడ్డగా వ్యవహరిస్తూ మాట్లాడారు నాకు చాలా అనందం వేసింది. రాయలసీమ రైతులు ఎంత కష్టం వచ్చినా వర్షాలు లేకపోయినా దృఢసంకల్పంతో సాగు చేస్తారు.

మీ సంకల్పాన్ని చూసే అనంత్ అంబానీ నన్ను మీ బిడ్డగా స్వీకరించాలని కోరారు. రిలయన్స్ సంస్థ ఈ ప్రాంతానికి అండగా నిలుస్తుందని భావిస్తున్నాను. ఇండియన్ స్కూల్ అగ్రికల్చర్ ప్రపంచ స్థాయి సంస్థగా ఎదగాలని కోరుతున్నాను… నిర్మలా సీతారామన్