
రేపల్లె : స్వయం సహాయక సంఘాల ద్వారా అందుతోన్న రుణాలను సద్వినియోగం చేసుకుని మహిళలు ఆర్థికంగా ఎదగాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆకాంక్షించారు. డ్వాక్రా రుణాలు, ప్రభుత్వ ప్రోత్సాహంతో చిన్న వ్యాపారాలను ప్రారంభించి వాటిని క్రమంగా విస్తరించుకోవచ్చని సూచించారు. బాపట్ల జిల్లా రేపల్లె నియోజకవర్గంలో పేదల సేవలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు పాల్గొన్నారు. రేపల్లెలోని 4వ వార్డులో శ్రీలక్ష్మి కిరాణా జనరల్ స్టోర్‌ను సందర్శించి దుకాణా యజమాని జి.జేజమ్మతో పాటు స్వయం సహాయక సంఘాల మహిళలతో సీఎం ముఖాముఖి మాట్లాడారు.
రూ.2 లక్షల రుణంతో విస్తరించిన వ్యాపారం :
డ్వాక్రా రుణంతో కిరాణా దుకాణాన్ని ఏర్పాటు చేసుకుని నిర్వహిస్తున్నామని జి.శ్రీనివాసరావు, జి.జేజమ్మ దంపతులు ముఖ్యమంత్రికి వివరించారు. 2003 నుంచి పెయింటర్‌గా పనిచేస్తున్నారని శ్రీనివాసరావు వివరించారు. 2025 ఫిబ్రవరిలో రూ.1 లక్ష పెట్టుబడితో చిన్న దుకాణాన్ని ఏర్పాటు చేసుకున్నామని, అదే ఏడాది జూన్‌లో రూ.2 లక్షల గ్రూప్ లింకేజీ రుణం లభించడంతో వ్యాపారాన్ని కొంత విస్తరించినట్లు వారు తెలిపారు.
సాంకేతికతను సైతం వినియోగించుకుంటూ తమ వ్యాపారాన్ని నిర్వహిస్తున్నట్లు జెజమ్మ, శ్రీనివాసరావు తెలిపారు. స్మార్ట్ఫోన్లు, వాట్సాప్ ద్వారా వినియోగదారుల నుంచి ఆర్డర్లు తీసుకుంటూ నెలవారీ కిరాణా సరుకుల అవసరాలను వినియోగదారులు వాట్సాప్‌లో పంపుతుండగా, ఆర్డర్ చేసిన సరుకులను తన భర్త వారి ఇళ్లకు వెళ్లి అందజేస్తున్నట్లు జేజమ్మ తెలిపారు. ప్రభుత్వం తీసుకొచ్చిన ‘వన్ ఫ్యామిలీ–వన్ ఎంట్రప్రెన్యూర్ కార్యక్రమం తనకు ఎలా స్ఫూర్తిని ఇచ్చిందో జేజమ్మ సీఎంతో పంచుకున్నారు.
వ్యాపార నిర్వహణపై మహిళలకు సీఎం దిశానిర్దేశం :
తమ వ్యాపార ఆలోచనలు, అనుభవాలు, భవిష్యత్ ప్రణాళికలను డ్వాక్రా మహిళలు సీఎంకు వివరించారు. వివిధ రంగాల్లో ఉన్న వ్యాపార అవకాశాలను మహిళలు అన్వేషించి స్వయం ఉపాధి దిశగా ముందుకు సాగాలని సీఎం చంద్రబాబు వారికి సూచించారు. స్వయం సహాయక సంఘాల మహిళలకు వాట్సాప్ బిజినెస్‌పై ఉన్న అవగాహనను ముఖ్యమంత్రి అడిగి తెలుసుకున్నారు. అనంతరం శ్రీనివాసరావు తండ్రి వెంకటరావుకు సీఎం చంద్రబాబు వృధ్యాప్య పింఛన్‌ను అందజేశారు. అనంతరం స్వయం సహాయక సంఘాల మహిళలతో కలిసి సీఎం ఫొటో దిగారు.