ఇచ్చిన హామీ నెరవేర్చిన డిప్యూటీ సీఎం!

​రూ. 10 కోట్లతో నాగులాపల్లి మంచినీటి పథకం ప్రారంభం

​ప్రజలందరికీ సురక్షితమైన, స్వచ్ఛమైన తాగు నీరు నిరంతరాయంగా అందాలనే లక్ష్యంతో పిఠాపురం నియోజకవర్గంలో ఆధునీకరించిన నాగులాపల్లి సమగ్ర రక్షిత మంచినీటి పథకాన్ని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, గ్రామీణ నీటి సరఫరా శాఖ మంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు మంగళవారం ప్రారంభించారు. జల్ జీవన్ మిషన్-అమరజీవి జలధార నిధులు దాదాపు రూ. 10 కోట్లతో ఈ పునరుద్ధరణ పనులను పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకువచ్చారు.

​ప్రత్యేక చొరవ – సమస్య పరిష్కారం

​సార్వత్రిక ఎన్నికల విజయం తర్వాత శ్రీ పవన్ కళ్యాణ్ గారు చేపట్టిన పర్యటనలో వాకపల్లి, ఇసుకపల్లి, నాగులాపల్లి, కొండెవరం, యు. కొత్తపల్లి మండల తీరప్రాంత ప్రజలు తాగునీటి ఎద్దడి గురించి ఆయన దృష్టికి తీసుకువెళ్లారు.

  • ​గతంలో మనిషికి 40 లీటర్ల చొప్పున ఈ పథకాన్ని రూపొందించగా, కాలక్రమేణా జనాభా మరియు ఆవాసాలు పెరగడంతో నీటి సరఫరా చాలక ప్రజలు ఇబ్బందులు పడ్డారు.
  • ​విషయాన్ని గ్రహించిన ఉప ముఖ్యమంత్రివర్యులు తక్షణమే స్పందించి ప్రత్యేక చొరవతో ఈ పథక పునరుద్ధరణకు శ్రీకారం చుట్టారు.

మౌలిక వసతుల ఆధునీకరణ & సాంకేతిక మెరుగుదలలు

​ఈ సమగ్ర పథకం కింద అనేక కీలక అభివృద్ధి పనులు చేపట్టి వేగవంతంగా పూర్తి చేశారు:

  • ​ఇంటేక్ వెల్ సామర్థ్యం పెంపు: నీటి తోడే సామర్థ్యాన్ని పెంచేందుకు మూడు 20 హెచ్‌పీ మోటార్ల ఏర్పాటు.
  • ​భారీ పైపు లైన్లు: నవఖందరాడ నుండి వాకపల్లి వరకు 3.8 కిలోమీటర్ల మేర నూతన పైపు లైన్, అలాగే మూలపేట గ్రామంలో దెబ్బతిన్న పాత పైపు లైన్ స్థానంలో కొత్తది ఏర్పాటు.
  • ​మైక్రో ఫిల్టర్లు: రెండు మిలియన్ లీటర్ల సామర్థ్యం గల మైక్రో ఫిల్టర్ ఏర్పాటుతో పాటు సంపులు, ట్యాంకుల సమగ్ర పునరుద్ధరణ.

52 ఆవాసాలు.. 97 వేల మందికి లబ్ధి

​ఈ పథకం ద్వారా యు. కొత్తపల్లి మండల పరిధిలోని 51 ఆవాసాలకు, పిఠాపురం రూరల్ మండల పరిధిలోని ఒక ఆవాసానికి (మొత్తం 52 ఆవాసాలు) నీటి కష్టాలు తీరాయి. దాదాపు 97 వేల మందికి పైగా రోజుకు తలకు 55 లీటర్ల చొప్పున శుద్ధి చేసిన రక్షిత తాగునీరు అందుతుంది.

​స్వయంగా నీటి నాణ్యత పరీక్షించిన ఉప ముఖ్యమంత్రి

​పర్యటన సందర్భంగా శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఆధునీకరించిన విభాగాలు, వాటర్ పైప్ లైన్ మ్యాప్ మరియు ఫోటో గ్యాలరీని పరిశీలించారు.

  • ​పథకానికి ప్రధాన నీటి వనరైన చెరువును పరిశీలించి, చుట్టుపక్కల కాలుష్య కారకాలు కలవకుండా చూడాలని అధికారులను ఆరా తీశారు.
  • ​పథకంలోని ల్యాబ్‌ను సందర్శించి నీటి నాణ్యతను స్వయంగా పరీక్షించారు.

​’గతంలో 3 బిందెలే.. ఇప్పుడు 10 బిందెలు వస్తున్నాయి’

​పథక ప్రారంభం అనంతరం కొండెవరం గ్రామంలోని శ్రీ బర్రె లక్ష్మణ దాసు ఇంటిని సందర్శించిన ఉప ముఖ్యమంత్రి, గృహ కుళాయి (ట్యాప్) తిప్పి నీటి నాణ్యతను, సరఫరా ఒత్తిడిని పరిశీలించారు.

​”గతంలో కుళాయి ద్వారా రోజుకు మూడు బిందెల నీరు మాత్రమే వచ్చేవి, కానీ ఇప్పుడు ఉత్సాహంగా పది బిందెల వరకు నీరు వస్తోంది” అని లక్ష్మణ దాసు కుటుంబ సభ్యులు ఆనందం వ్యక్తం చేస్తూ ఉప ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు తెలిపారు.

కార్యక్రమంలో పాల్గొన్న ప్రముఖులు

​ఈ ప్రారంభోత్సవంలో కాకినాడ ఎంపీ శ్రీ తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్, కాకినాడ రూరల్ ఎమ్మెల్యే శ్రీ పంతం నానాజీ, రాజానగరం ఎమ్మెల్యే శ్రీ బత్తుల బలరామకృష్ణ, నీటిపారుదల అభివృద్ధి సహకార సంస్థ ఛైర్మన్ శ్రీ వేగుళ్ల లీలాకృష్ణ, జిల్లా కలెక్టర్ శ్రీ హరేంధిర ప్రసాద్, ఆర్‌డబ్ల్యూఎస్ ఈఎన్సీ శ్రీమతి గాయత్రిదేవి తదితర అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.