“కూటమి” పాలన ఉంటే అభివృద్ధి-నిమ్మల

అమరావతి : కూటమి పాలనతోనే రాష్ట్రానికి శ్రీరామరక్ష అని రాష్ట్ర జల వనరుల శాఖ మంత్రి డాక్టర్ నిమ్మల రామానాయుడు అన్నారు. సోమవారం ప్రకాశం జిల్లా చీమకుర్తిలో కారుమంచి మేజర్ కెనాల్ జల హారతి కార్యక్రమంలో మంత్రి పాల్గొన్నారు.

సూపర్ ఎల్‌నినో వంటి విపత్కర పరిస్థితుల్లోనూ చీమకుర్తి వంటి మారుమూల ప్రాంతానికి తాగునీటిని అందించడం గొప్ప విషయమని మంత్రి అన్నారు.

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నీటి నిర్వహణలో చూపుతున్న సమర్థత, ముందు చూపును జాతీయ మీడియా గుర్తించి ఆయనను ‘వాటర్‌మ్యాన్’గా అభివర్ణించడం రాష్ట్ర ప్రజలందరికీ గర్వకారణమన్నారు.

సియం ముందుచూపుతో రాష్ట్రంలోని రిజర్వాయర్ల లో కనీస నీటి నిల్వలను కాపాడుతూ తాగునీటికి ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు.

చీమకుర్తి ప్రాంత ఇరిగేషన్ పనులకు సంబంధించి స్థానిక ప్రజాప్రతినిధులు అందించిన విజ్ఞాపనలను స్వీకరించిన మంత్రి, వాటిని ప్రాధాన్యతా క్రమంలో పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు.

రాష్ట్రం సంపూర్ణంగా అభివృద్ధి చెందాలంటే కూటమి ప్రభుత్వం మరో 15–20 ఏళ్లు కొనసాగాల్సిన అవసరం ఉందని మంత్రి అన్నారు.

అధికారాన్ని తరచూ మార్చుకుంటూ పోతే రాష్ట్రానికి తీవ్ర నష్టం జరుగుతుందని పేర్కొన్నారు.