జనసేనలోకి ప్రత్తిపాడు మాజీ ఎమ్మెల్యే వరుపుల సుబ్బారావు

అమరావతి : కాకినాడ జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గానికి చెందిన మాజీ శాసన సభ్యులు, వైసీపీ నేత వరుపుల సుబ్బారావు జనసేన పార్టీలో చేరారు. సోమవారం సాయంత్రం పిఠాపురంలో రాష్ట్ర ఉప ముఖ్యమంత్రివర్యులు శ్రీ పవన్ కళ్యాణ్ గారి సమక్షంలో ఆయన జనసేనలో చేరారు. పెద్దాపురం మాజీ మున్సిపల్ వైస్ ఛైర్మన్, వైసీపీకి చెందిన నాయకుడు నెక్కంటి సాయి ప్రసాద్, సామర్లకోట మాజీ మున్సిపల్ ఛైర్మన్ గంగిరెడ్డి అరుణ, రెండు మున్సిపాలిటీల పరిధిలోని మాజీ మున్సిపల్ కౌన్సిలర్లు, ప్రత్తిపాడు, పెద్దాపురం, జగ్గంపేట నియోజకవర్గాలకు చెందిన పలువురు వైసీపీ నాయకులు జనసేనలో చేరిన వారిలో ఉన్నారు. అందరికీ పార్టీ కండువాలు కప్పి పవన్ కళ్యాణ్ సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. క్షేత్రస్థాయిలో పార్టీ బలోపేతానికి కృషి చేయాలని ఆకాంక్షించారు. కాకినాడ పార్లమెంటు సభ్యులు తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్, రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ, డీసీసీబీ ఛైర్మన్ తుమ్మల రామస్వామి ఆధ్వర్యంలో వీరంతా జనసేన పార్టీలో చేరారు. ఈ కార్యక్రమంలో రాజానగరం ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ, మాజీ శాసన సభ్యులు పెండెం దొరబాబు, పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ ఛైర్మన్ కళ్యాణం శివశ్రీనివాస్, రాష్ట్ర నీటి పారుదల అభివృద్ధి సహకార సంస్థ ఛైర్మన్ వేగుళ్ల లీలాకృష్ణ, సివిల్ సప్లైస్ కార్పొరేషన్ ఛైర్మన్ తోట సుధీర్, కౌడా ఛైర్మన్ తలాటం సత్య, పిఠాపురం ఫైవ్ మెన్ కమిటీ సభ్యులు ఓదూరి కిషోర్ తదితరులు పాల్గొన్నారు.