మంగళగిరిలో ప్రతి “గడప”కు తాగునీటి కనెక్షన్-లోకేష్

తాడేపల్లి: మంగళగిరిలో 2029 ఎన్నికల లోపు ప్రతి గడపకి తాగునీటి కనెక్షన్, అండర్ గ్రౌండ్ గ్యాస్ కనెక్షన్, భూగర్భ డ్రైనేజి పూర్తిచేసే బాధ్యత నేను తీసుకుంటా, ఆనాడు ఇచ్చిన ప్రతి హామీకి కట్టుబడి ఉన్నానని విద్య, ఐటి, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ అన్నారు.

తాడేపల్లి మండలం కుంచనపల్లి శ్రీశ్రీనివాస కన్వెన్షన్స్ లో మన ఇల్లు – మన లోకేష్ కార్యక్రమంలో భాగంగా మంత్రి లోకేష్ చేతుల మీదుగా 372మందికి శాశ్వత పట్టాలు, పిఎంఎవై మంజూరు పత్రాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ… మంగళగిరిలో 100 పడకల ఆసుపత్రి ఇక్కడ ప్రజల దశాబ్ధాల కల.

ప్రజా ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎవ్వరూ ఊహించని రీతిలో రాష్ట్రంలోనే తొలిసారిగా ఆసుపత్రి నిర్మాణానికి శ్రీకారం చుట్టాం.

వచ్చే సంవత్సరం మొదటి మూడు నెలల్లో ఆసుపత్రి పనులు పూర్తి చేసి ప్రజలకి అంకితం చేసే బాధ్యత మేం తీసుకుంటాం.

మహానాడు కట్టకి రిటైనింగ్ వాల్, భూగర్భ డ్రైనేజి, తాగునీటి సమస్యకు శాశ్వతమైన పరిష్కారం కావాలని ఎన్నికల సమయంలో అడిగారు.

వాటిని ప్రణాళికా బద్ధంగా చేపట్టి, పూర్తి చేస్తామని స్పష్టం చేశారు.

బాధ్యత పెంచిన అత్యధిక మెజార్టీ :

నేను మంగళగిరిలో పుట్టకపోయినా 2019లో మంగళగిరి నా సొంత ఊరుగా భావించి ఇక్కడ ఎమ్మెల్యేగా పోటీచేశా.

ఇక్కడ ప్రజలను అర్థం చేసుకునేలోపే ఎన్నికలు అయిపోయాయి, 5300 ఓట్ల తేడాతో నేను ఆనాడు ఓడిపోయా. ఆ ఓటమి నాలో కసి పెంచింది.

ఐదు సంవత్సరాలు కష్టపడి మీ మనసు గెలుచుకొని ఇక్కడనుంచే శాసనసభ్యుడిగా అసెంబ్లీకి వెళ్లాలని నిర్ణయించుకున్నా.

ఎన్నికల ప్రచారంలో ఎన్ని ఓట్లతో నేను 2019లో ఓడిపోయానో, దానిపక్కన ఒక్క సున్నా పెట్టి ఆ మెజారిటీతో నన్ను గెలిపించాలని కోరా.

మీరు నన్ను ఎంత ఎక్కువ మెజారిటీతో గెలిపిస్తే అంత బలం వస్తుంది, చంద్రబాబు, పవనన్నతో పోరాడి నిధులు తెస్తానని ఆనాడు హామీ ఇచ్చా.

మీ ఆశీస్సులతో ఆంధ్రరాష్ట్ర చరిత్రలోనే టాప్-3 మెజారిటీతో విజయం సాధించా.

నేను 53వేల మెజారిటీ అడిగితే, 92వేల ఓట్ల ఆధిక్యతతో నన్ను ఆశీర్వదించి అసెంబ్లీకి పంపించారు.

మీరిచ్చిన మెజారిటీతో నా బాధ్యత పెరిగింది.

ఆనాటి నుంచి అహర్నిశలు మంగళగిరి ప్రజల గురించే ఆలోచిస్తున్నానని మంత్రి లోకేష్ పేర్కొన్నారు.