“చెత్త”ఏరుకునే కుటుంబానికి అండగా ప్రభుత్వం

నెల్లూరు : చెత్త కాగితాలు ఏరుకుంటూ జీవనం సాగిస్తున్న నిరుపేద కుటుంబం ఎదుర్కొంటున్న కష్టాలను సోషల్ మీడియా ద్వారా తెలుసుకున్న రాష్ట్ర ఐటీ, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ తక్షణమే స్పందించారు. కుటుంబ పరిస్థితులను పరిశీలించి అవసరమైన సహాయం అందించాలని నెల్లూరు జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్లాను ఆదేశించారు.

వైయస్సార్ కడప జిల్లా బ్రహ్మంగారిమఠం మండలానికి చెందిన ఇస్తేరమ్మ, ఆశీర్వాదం చెత్త కాగితాలు ఏరుకుంటూ జీవనం సాగిస్తున్నారు. వీరు ఇటీవల తమ బిడ్డలతో నెల్లూరు జిల్లా దుత్తలూరు మండలం నర్రవాడలో పడుతున్న కష్టాలు సోషల్ మీడియాలో పబ్లిష్ కి అయ్యాయి. ఈ మేరకు జిల్లా యంత్రాంగం తక్షణ చర్యలు చేపట్టి ఆ కుటుంబానికి ప్రభుత్వపరంగా అండగా నిలిచింది.

కుటుంబం ఆర్థిక ఇబ్బందులతో జీవనం సాగిస్తున్న పరిస్థితిని తెలుసుకున్న మంత్రి నారా లోకేష్, పిల్లల భవిష్యత్తు, కుటుంబ ఆరోగ్యం, ఆర్థిక పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని అవసరమైన సహాయం అందించాలని అధికారులను ఆదేశించారు. బాలుడి పరిస్థితిపై కూడా మంత్రి స్పందించి, బాలుడిని సురక్షితంగా కుటుంబ సభ్యుల చెంతకు చేర్చి చదువుకునేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.

మంత్రి ఆదేశాల మేరకు జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్లా సంబంధిత అధికారులతో సమన్వయం చేసి కుటుంబానికి అవసరమైన చర్యలను ప్రారంభించారు. బాలుడు పురుష రామయ్య, వయస్సు 10 సంవత్సరాలు, ఎస్టీ ఎరుకుల సామాజిక వర్గానికి చెందిన బాలుడు. దుత్తలూరు మండలం నరవాడ గ్రామంలో గుర్తించబడిన ఈ బాలుడిని నెల్లూరులోని ఏపీటీడబ్ల్యూఆర్‌ఎస్‌ బాలుర పాఠశాలలో చేర్పించి, వసతి కల్పించేందుకు చర్యలు చేపడుతున్నారు. పీడీ ఐసీడీఎస్‌ అధికారులు రామయ్యను తమ ఆధీనంలోకి తీసుకుని, ప్రస్తుతం నెల్లూరుకు తీసుకువస్తున్నారు.

అదేవిధంగా కుటుంబంలోని పాపకు గుండె సంబంధిత సమస్యకు అవసరమైన ఆపరేషన్‌ చేయించేందుకు వైద్యపరమైన చర్యలు చేపట్టారు. అవసరమైన వైద్య పరీక్షలు, చికిత్సను ప్రభుత్వపరంగా అందించేలా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. కుటుంబానికి శాశ్వత నివాసం కల్పించే ఉద్దేశంతో ప్రభుత్వం ద్వారా ఇంటి స్థలం అందించేందుకు చర్యలు చేపట్టారు. కుటుంబ పెద్ద అయిన తండ్రికి అవసరమైన వైద్య చికిత్స అందించేందుకు సంబంధిత శాఖల ద్వారా ఏర్పాట్లు చేస్తున్నారు.

కుటుంబ ఆర్థిక పరిస్థితిని మెరుగుపరిచేందుకు తల్లిని స్వయం సహాయక సంఘాల నెట్‌వర్క్‌లో భాగస్వామ్యం చేసి, ఆర్థికంగా చేయూత అందించేందుకు చర్యలు చేపట్టారు. కుటుంబానికి అర్హత మేరకు ఇతర ప్రభుత్వ సంక్షేమ పథకాల ప్రయోజనాలు కూడా అందేలా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు.

పేదరికం కారణంగా పిల్లలు విద్యకు, వైద్య సదుపాయాలకు దూరం కాకుండా వారికి అవసరమైన ప్రభుత్వ సహాయం అందించడమే లక్ష్యంగా జిల్లా యంత్రాంగం చర్యలు చేపడుతోంది. మంత్రి నారా లోకేష్ స్పందనతో, జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్లా తక్షణ చర్యలతో ఆ నిరుపేద కుటుంబానికి ప్రభుత్వం భరోసాగా నిలిచింది.