జగన్ నోరు తెరిస్తే అబద్ధాలే.. అచ్చెన్న

అమ‌రావ‌తి : వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ నోరు తెరిస్తే అబద్ధాలు, అభివృద్ధి కార్యక్రమాలు కనిపిస్తే అక్కసు అన్నట్టుగా ఆయన తీరు తయారైందని మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు మండిపడ్డారు.

2019–24 మధ్య వైసీపీ ఐదేళ్ల పాలనపై ముందుగా ఆత్మపరిశీలన చేసుకోవాలని సూచించారు. ప్రజా ప్రభుత్వానికి రైతు సంక్షేమంపై జగన్ పాఠాలు చెప్పడం “దెయ్యాలు వేదాలు వల్లించినట్టు” ఉందని ఎద్దేవా చేశారు.

రాయలసీమకు పెట్టుబడులు రావడం, రైతులకు మెరుగైన ఆదాయం కల్పించే ప్రయత్నాలు జరగడం కూడా తప్పుగానే కనిపిస్తోందా అని ప్రశ్నించారు.

తాడేపల్లిలో కూర్చొని రాజకీయ విమర్శలు చేయడం కంటే, రైతుల కష్టాలు, వారి సమస్యలు, కూటమి ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ కార్యక్రమాలపై వాస్తవాలను తెలుసుకుని మాట్లాడాలని హితవు పలికారు.

రైతుల కోసం పనిచేస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుని విమర్శించే ముందు, మీ ఐదేళ్ల పాలనలో వ్యవసాయ రంగాన్ని ఏ పరిస్థితికి తీసుకొచ్చారో ఒక్కసారి గుర్తు చేసుకోవాలని, తాడేపల్లి ప్యాలెస్‌లో కూర్చొని ప‌బ్ జీ గేమ్ ఆడుకునే జ‌గ‌న్ కు ప్ర‌జా ప్ర‌భుత్వంపై విమ‌ర్శ‌లు చేసే హ‌క్కు ఎక్కుడుందని మంత్రి అచ్చెన్నాయుడు అన్నారు.

లక్ష కోట్ల పెట్టుబడులకు, బడ్జెట్ కేటాయింపులకు తేడా తెలియదా?

లక్ష కోట్ల పెట్టుబడులకు, రాష్ట్ర బడ్జెట్ కేటాయింపులకు తేడా తెలియకుండా మాజీ సీఎం జగన్ విమర్శలు చేయడం సరికాదని మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు అన్నారు.

గ్లోబల్ హార్టికల్చర్ హబ్ – రైజింగ్ రాయలసీమలో భాగంగా పూర్వోదయ పథకం ద్వారా సుమారు ₹40 వేల కోట్లు, ప్రైవేటు రంగం నుంచి ₹60 వేల కోట్ల పెట్టుబడులు సమీకరించాలన్నది ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. ప్రైవేటు పెట్టుబడులను కూడా రాష్ట్ర బడ్జెట్ కేటాయింపులుగా చూపించాలా అని ప్రశ్నించారు.

ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు విజన్‌లో భాగంగా 2014–19లో 5.9 లక్షల మంది రైతులకు 6.58 లక్షల హెక్టార్లలో మైక్రో ఇరిగేషన్ ఏర్పాటు కాగా, 2019–24లో 2.6 లక్షల మంది రైతులకు 2.9 లక్షల హెక్టార్లలో మాత్రమే ఏర్పాటు చేసి ₹1,166 కోట్లు బకాయి పెట్టారని తెలిపారు.

కూటమి ప్రభుత్వం సబ్సిడీలను పునరుద్ధరించి రైతులకు మైక్రో ఇరిగేషన్‌ను అందుబాటులోకి తెచ్చిందన్నారు. ఉద్యాన రంగంలో 2014–19లో 17 శాతం, వైసీపీ హయాంలో 2019–24లో 9 శాతం, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 2024–25లో 21 శాతం వృద్ధి నమోదైందని తెలిపారు.

ఉద్యాన పంటల విస్తీర్ణం 2014–19లో 2.91 లక్షల హెక్టార్లు పెరగగా, 2019–24లో 83 వేల హెక్టార్లు మాత్రమే పెరిగిందని, కూటమి ప్రభుత్వం ఒక్క ఏడాదిలోనే 71 వేల హెక్టార్లు పెంచిందని పేర్కొన్నారు.

ఆయిల్‌పామ్ సాగులో ఆంధ్రప్రదేశ్ దేశంలో మొదటి స్థానంలో ఉందని మంత్రి తెలిపారు. గతంలో ₹194 విలువైన ఆయిల్‌పామ్ మొక్కలను రైతులు బ్లాక్ మార్కెట్‌లో ₹400–₹500 వరకు కొనాల్సిన పరిస్థితి ఉండగా, కూటమి ప్రభుత్వం రాయితీని పునరుద్ధరించి రైతులకు ఉచితంగా మొక్కలు అందిస్తోందన్నారు.

ఈ గణాంకాలు, ప్రభుత్వ చర్యలు రాయలసీమతో పాటు రాష్ట్ర ఉద్యాన రంగ అభివృద్ధిపై ప్రభుత్వ ప్రాధాన్యతను స్పష్టంగా తెలియజేస్తున్నాయని మంత్రి అచ్చెన్నాయుడు అన్నారు.

రైతులను ఆదుకున్న చర్యలపై పంటలవారీగా చర్చకు సిద్ధమా?

ధరలు పడిపోయినప్పుడు రైతులను ఆదుకునేందుకు మా ప్రభుత్వం చేపట్టిన మార్కెట్ జోక్య చర్యలను ప్రజల ముందుంచాం. ధరల స్థిరీకరణ నిధి కింద 2025–26లో ₹300 కోట్లు కేటాయించగా, ఇప్పటికే సుమారు ₹800 కోట్లు మద్దతు ధరల కోసం ఖర్చు చేశాం.

ఇందులో పొగాకు ₹271 కోట్లు, మామిడి ₹261 కోట్లు, ఉల్లి ₹125 కోట్లు, కోకో ₹14 కోట్లు, టమాటాకు ₹12 కోట్లు ఖర్చు చేశాం. మిర్చికి MIS కింద క్వింటాకు ₹11,781.25 MIP ధరను కేంద్రం నిర్ణయించింది.

2017లో ₹130 కోట్లు ఖర్చు చేసి 55 వేల మంది రైతులకు క్వింటాకు ₹1,500 చొప్పున చెల్లించాం. వైసీపీ హయాంలో 2020లో మార్కెట్ రేటు ₹12,000 ఉన్నప్పటికీ ₹7,000 మద్దతు ధరగా నిర్ణయించి, అమలుకు అవసరమైన నిధులు ఇవ్వలేదు.

కోకో రైతులకు కిలోకు ₹50 చొప్పున ₹14 కోట్లు మంజూరు చేసి, ₹11.8 కోట్లు ఖర్చు చేశాం. తోతాపూరి మామిడికి ₹260 కోట్లతో కిలోకు అదనంగా ₹4 చెల్లించే ఏర్పాటు చేశాం.

2026–27 సీజన్‌లో కూడా తోతాపూరి మామిడికి కిలోకు ₹4 చొప్పున మద్దతు అందించి రైతులను ఆదుకున్నాం. రైతుల సంక్షేమంపై విమర్శలు చేసే వారు మా ప్రభుత్వ చర్యలపై పంటలవారీగా చర్చకు సిద్ధంగా ఉంటే, వాస్తవ గణాంకాలతో ప్రజల ముందే సమాధానం చెప్పడానికి మేము సిద్ధంగా ఉన్నామని మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు అన్నారు.

ఉచిత పంటల బీమా పేరుతో మీ పాలనలో జరిగినదేమిటి?

ఉచిత పంటల బీమాపై మాట్లాడే ముందు వైసీపీ హయాంలో రైతులకు అందిన బీమా పరిహారంపై మాజీ సీఎం జగన్ సమాధానం చెప్పాలని మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు అన్నారు.

రబీ 2018–19 పంట బీమా పరిహారం కూడా 2020 జూన్‌లోనే విడుదలైనట్లు ప్రభుత్వ రికార్డులు చెబుతున్నాయని, 2019–20 నుంచి 2022–23 వరకు వివిధ సీజన్లలో బీమా పరిహారాలు చెల్లించబడ్డాయని పేర్కొన్నారు.

ప్రస్తుతం మా ప్రభుత్వం రైతు భాగస్వామ్యంతో పంటల బీమా అమలు చేస్తోంది. ఖరీఫ్ ఆహార, నూనెగింజల పంటలకు రైతు వాటా గరిష్ఠంగా 2 శాతంగా ఉండగా, మిగిలిన ప్రీమియాన్ని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు భరిస్తాయి.

రైతులకు పంట నష్ట సమయంలో ఆర్థిక భరోసా కల్పించడమే మా ప్రభుత్వ లక్ష్యమని మంత్రి తెలిపారు. విత్తన సంస్థలకు సుమారు ₹471 కోట్ల బకాయిలు మిగిల్చిన గత ప్రభుత్వ విధానాల ప్రభావాన్ని అధిగమిస్తూ, బకాయిలను పరిష్కరించి నాణ్యమైన విత్తనాల సరఫరాను బలోపేతం చేస్తున్నామని అచ్చెన్నాయుడు అన్నారు.

నాణ్యమైన విత్తనాలను సబ్సిడీపై రైతులకు అందించడం వ్యవసాయ ఉత్పాదకతకు కీలకమని వ్యవసాయ శాఖ కూడా పేర్కొంటోంది.

2023 ఏప్రిల్, మే నెలల్లో అధిక వర్షాలతో నష్టపోయిన మొక్కజొన్న, జొన్న రైతులకు ఇవ్వాల్సిన ₹5 కోట్ల ఇన్‌పుట్ సబ్సిడీని గత ప్రభుత్వం విడుదల చేయలేదని మంత్రి తెలిపారు.

వరికి ఇన్‌పుట్ సబ్సిడీని ₹17,000 నుంచి ₹25,000కు పెంచి, జూన్ 2024 నుంచి 2025 నాటికి 2 లక్షల మంది రైతులకు ₹310 కోట్లు అందించామని పేర్కొన్నారు.

రైతు కుటుంబాలకు పరిహారం.. ప్రకృతి విపత్తు బాధితులకు సాయం

వైసీపీ హయాంలో పరిహారం అందని 81 మంది రైతు కుటుంబాలకు ₹5.67 కోట్ల పరిహారం చెల్లించామని, 2025–26లో ₹22 కోట్ల బడ్జెట్ కేటాయించామని తెలిపారు.

150 మంది రైతు కుటుంబాలకు ₹10.50 కోట్ల పరిహారం కోసం బిల్లులు సమర్పించామని, అందులో వైసీపీ హయాంలో ఆత్మహత్యలు చేసుకున్న 82 మంది రైతుల కుటుంబాలు ఉన్నాయని చెప్పారు.

ఉద్యాన పంటలు నష్టపోయిన రైతులకు ₹50 కోట్ల ఇన్‌పుట్ సబ్సిడీ అందించామని, 2023 ఖరీఫ్, రబీ కరువు, డిసెంబర్ 2023 మిచాంగ్ తుఫాను వల్ల నష్టపోయిన 1,21,590 మంది రైతులకు చెల్లించాల్సిన ₹147 కోట్లకు కూడా బిల్లులు సమర్పించామని మంత్రి అచ్చెన్నాయుడు తెలిపారు.

రైతు సంక్షేమంపై రాజకీయ విమర్శలు చేసే ముందు వాస్తవ గణాంకాలను పరిశీలించాలని, రైతులకు అందుతున్న బీమా, ఇన్‌పుట్ సబ్సిడీ, పరిహారం వివరాలపై చర్చకు సిద్ధంగా ఉన్నామని మంత్రి స్పష్టం చేశారు.