ఫార్మా రంగంలో పెట్టుబడులు పెట్టండి- లోకేష్

అహ్మదాబాద్ : పెట్టుబడుల ఆకర్షణే లక్ష్యంగా సీఐఐ పార్ట్‌నర్‌షిప్ సమ్మిట్ 2026 – ఏపీ ఈడీబీ ఆధ్వర్యంలో ఫార్మా రంగంపై అహ్మదాబాద్‌లో నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశంలో మంత్రి నారా లోకేష్ పాల్గొన్నారు. అనకాపల్లి జిల్లా నక్కపల్లిలో ప్రజాప్రభుత్వం అభివృద్ధి చేస్తున్న బల్క్ డ్రగ్ పార్క్ గురించి మంత్రి వివరించారు. మంత్రి మాట్లాడుతూ.. ఫార్మా రంగంలో పెద్దఎత్తున పెట్టుబడులు పెట్టాలని ఆహ్వానించారు. ఫార్మాస్యూటికల్ తయారీ, ఔషధ ఎగుమతులు, ఆర్ అండ్ డీ, మౌలిక వసతులు, నైపుణ్యంతో కూడిన మానవ వనరులు వంటి అన్ని అంశాలను సమన్వయం చేస్తూ భారత ఫార్మా రంగ అభివృద్ధికి ఏపీ ప్రధాన కేంద్రంగా ఎదుగుతోంది. 2030 నాటికి భారత ఫార్మా మార్కెట్ 130 బిలియన్ డాలర్ల దిశగా వేగంగా అభివృద్ధి చెందుతోంది. ఏపీ భారతదేశంలో 3వ అతిపెద్ద ఔషధ ఎగుమతిదారుగా ఉంది. ప్రపంచ ఫార్మసీ మార్కెట్ విలువ 60 బిలియన్ డాలర్లు కాగా.. ప్రపంచ సరఫరాలో భారతదేశ వాటా 20%గా ఉంది. 2030 నాటికి పేటెంట్ గడువు ముగియనున్న ఔషధాల విలువ 251 బిలియన్ డాలర్లుగా ఉంది. 11.05 బిలియన్ డాలర్ల విలువతో భారతదేశ టాప్-5 ఫార్మా రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ నిలిచింది.

బల్క్ డ్రగ్ పార్క్ లో పెట్టుబడులకు ఆహ్వానం :

అనకాపల్లి, విశాఖపట్నం, శ్రీకాకుళం, నెల్లూరు, విజయనగరం ప్రాంతాల్లో 4 ఫార్మాస్యూటికల్ క్లస్టర్లను అభివృద్ధి చేయడం జరుగుతోంది. విశాఖపట్నం భారతదేశపు ప్రముఖ మెడికల్ టెక్నాలజీ పార్క్ ఏఎంటీజడ్ (AMTZ) కు కేంద్రంగా ఉంది. 6 ఆపరేషనల్ పోర్టులు, 4 గ్రీన్‌ఫీల్డ్ పోర్టులు ఉన్నాయి. నక్కపల్లి వద్ద 2,000 ఎకరాల బల్క్ డ్రగ్ పార్క్ మొదటి దశ పూర్తైంది. నక్కపల్లి ఫార్మా పార్క్‌కు విస్తారమైన భూమి, పోర్ట్ కనెక్టివిటీ, తక్కువ నిర్వహణ వ్యయాలు, బలమైన ఫార్మా ఎకోసిస్టమ్ ఉన్నాయి. వీటితో పాటు ప్రభుత్వ మద్దతు, పెట్టుబడి రాయితీలు ప్రధాన ఆకర్షణలుగా ఉన్నాయి. అన్ని అనుకూలతలు ఉన్న బల్క్ డ్రగ్ పార్క్ లో పెట్టుబడులు పెట్టాలని ఈ సందర్భంగా పారిశ్రామికవేత్తలకు మంత్రి పిలుపునిచ్చారు.