
కాకినాడ : స్థానిక సంస్థల ఎన్నికలకు జనసేన పార్టీ సన్నద్ధం కావాలని పార్టీ అధ్యక్షులు, ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు పిలుపునిచ్చారు. ఈ ఎన్నికలకు ప్రణాళికాబద్ధంగా ముందుకు వెళ్లాలని స్పష్టం చేశారు. మంగళవారం మధ్యాహ్నం కాకినాడలో జనసేన నాయకులతో సమావేశం నిర్వహించారు. పార్టీ మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, కార్పొరేషన్ చైర్మన్లు, స్థానిక సంస్థల ఎన్నికల కోసం నియమించిన సమన్వయకర్తలు, కో ఆర్డినేషన్ కమిటీ సభ్యులు, సపర్ట్ టీం సభ్యులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఎన్నికల సన్నాహకాలపై శ్రీ పవన్ కళ్యాణ్ గారు దిశానిర్దేశం చేశారు. పార్లమెంట్ నియోజకవర్గాలవారీగా నియమించిన కమిటీలు క్షేత్ర స్థాయిలో అనుసరించాల్సిన విధివిధానాలను తెలియచేశారు.