కొండచరియలు విరిగిన ఘటనపై మంత్రి ఆనం సమీక్ష

అమరావతి : విజయవాడ ఇంద్రకీలాద్రిపై శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానం ప్రాంగణంలో కొండచరియలు విరిగిపడిన ఘటనపై తక్షణమే స్పందించి, అక్కడి పరిస్థితిని దేవాదాయ శాఖ మంత్రి ఆనం రాంనారాయణరెడ్డి సమీక్షించడం జరిగింది. భక్తులు, ఆలయ సిబ్బంది భద్రతకు అత్యంత ప్రాధాన్యతనిస్తూ, ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు తావులేకుండా అన్ని ముందస్తు జాగ్రత్త చర్యలు చేపట్టాలని అధికారులను మంత్రి ఆదేశించారు.ఈ ఘటనపై జిల్లా ఇంచార్జ్ మంత్రి సత్య కుమార్, దేవాదాయ శాఖ కమిషనర్ కే రామచంద్ర మోహన్ , విజయవాడ పార్లమెంట్ సభ్యులు కేశినేని చిన్ని, ఈవో శీనా నాయక్ , జిల్లా కలెక్టర్, పోలీస్ కమిషనర్‌తో ఫోన్ ద్వారా మాట్లాడి పరిస్థితి ని మంత్రి ఆనం సమీక్షించారు.

ఎన్ ఐ ఆర్ ఎం నిపుణులతో అధ్యయనం:

కొండచరియల పరిస్థితిపై శాస్త్రీయంగా,సాంకేతికంగా అధ్యయనం చేసేందుకు బెంగళూరులోని ‘నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ రాక్ మెకానిక్స్’ (NIRM) నిపుణులను తక్షణమే పిలిపించి, ఆ ప్రదేశాన్ని ప్రత్యక్షంగా పరిశీలింపజేయాలని అధికారులను ఆదేశించారు. గతంలోనూ NIRM నిపుణులు అందించిన సూచనలను మరోసారి పరిగణనలోకి తీసుకుని, భక్తుల భద్రత విషయంలో ఎట్టి పరిస్థితుల్లోనూ రాజీ పడకుండా తక్షణ చర్యలు చేపట్టాలని మంత్రి స్పష్టం చేశారు.భక్తుల భద్రత విషయంలో సాంకేతిక నిపుణుల సూచనలు పూర్తిగా పాటిస్తూ, భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా పటిష్టమైన చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు.దుర్గగుడి పరిసరాల్లో భద్రతా ప్రమాణాలను మరింత పటిష్టం చేసేందుకు మన ప్రభుత్వం అన్ని చర్యలూ తీసుకుంటుందని మంత్రి ఆనం వెల్లడించారు.