“ప్రెస్ కమిషన్” ఏర్పాటు చేయాలి-మీడియా అకాడమీ చైర్మన్ ఆలపాటి 

విజయవాడ : జర్నలిస్టుల స్థితిగతులు, వారికి అందాల్సిన ప్రయోజనాలు, సంక్షేమం, రక్షణకు తీసుకోవాల్సిన చర్యలపై ప్రభుత్వాలకు తగిన సూచనలు చేసేందుకు ప్రత్యేకంగా ‘ప్రెస్ కమిషన్’ ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని సీఆర్ మీడియా అకాడమీ చైర్మన్ ఆలపాటి సురేశ్ కుమార్ అన్నారు.

జాతీయ పత్రికా దినోత్సవం సందర్భంగా సోమవారం విజయవాడ ప్రెస్ క్లబ్‌లో ఎన్‌టీఆర్ ట్రస్ట్ బ్లడ్ బ్యాంక్, ప్రెస్ క్లబ్ సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించిన రక్తదాన శిబిరాన్ని ఆయన ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దేశంలో తొలి ప్రెస్ కమిషన్ సిఫార్సుల మేరకు ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఏర్పాటైన నేపథ్యంలో ప్రతి ఏటా జాతీయ పత్రికా దినోత్సవాన్ని నిర్వహించుకుంటున్నామని గుర్తుచేశారు.

దేశంలో ఇటీవల చోటు చేసుకుంటున్న ఆందోళనల నేపథ్యంలో పాత్రికేయుల భద్రతపై ప్రత్యేక దృష్టి సారించాల్సిన అవసరం ఉందన్నారు. ఢిల్లీలో జరిగిన ఆందోళనల నేపథ్యంలో ప్రెస్ కౌన్సిల్ చేసిన కొన్ని సూచనలు వివాదాస్పదంగా ఉన్నాయని పేర్కొన్నారు.

ఆందోళనల స్వరూప స్వభావాలను ప్రజలకు తెలియజేసే పాత్రికేయులు లాఠీచార్జి వంటి సందర్భాల్లో సంఘటనా స్థలానికి దూరంగా ఉండాలన్న సూచన ఆమోదయోగ్యం కాదన్నారు.

ఎన్‌టీఆర్ ట్రస్ట్ బ్లడ్ బ్యాంక్ ద్వారా రక్తాన్ని సేకరించి అవసరమైన రోగులకు అందించడం విశిష్టమైన సేవ అని ప్రశంసించారు. రక్తదానానికి ముందుకొచ్చిన పాత్రికేయులను ప్రత్యేకంగా అభినందించి, రక్తదానం చేసిన వారికి ట్రస్ట్ తరఫున సర్టిఫికెట్లు అందజేశారు.

ఎన్‌టీఆర్ ట్రస్ట్ అడ్మినిస్ట్రేటర్ దండమూడి హర్షిత మాట్లాడుతూ రక్తదాన శిబిరానికి సహకరించిన ప్రెస్ క్లబ్‌కు కృతజ్ఞతలు తెలిపారు.

కార్యక్రమానికి అధ్యక్షత వహించిన విజయవాడ ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు కంచల జయరాజ్ మాట్లాడుతూ స్వచ్ఛందంగా రక్తదానం చేసిన పాత్రికేయులు సమాజ సేవలోనూ ముందుంటామని నిరూపించారన్నారు. ఎన్‌టీఆర్ ట్రస్ట్ బ్లడ్ బ్యాంక్ సేవలను కొనియాడారు.

ఏపీయూడబ్ల్యూజే విజయవాడ అధ్యక్షుడు చావా రవి మాట్లాడుతూ దేశవ్యాప్తంగా పాత్రికేయులకు రక్షణ కొరవడిందని, జర్నలిస్టుల భద్రత కోసం ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ప్రభుత్వాలకు తగిన సూచనలు చేయాలని కోరారు.

ఏపీయూడబ్ల్యూజే విజయవాడ కార్యదర్శి దారం వెంకటేశ్వరరావు మాట్లాడుతూ సాధారణ రోగులకు అందిస్తున్నట్లుగానే పాత్రికేయులకు అవసరమైన సందర్భాల్లో 50 శాతం రాయితీతో రక్తాన్ని అందించాలని ఎన్‌టీఆర్ ట్రస్ట్ బ్లడ్ బ్యాంక్‌ను కోరారు.

ఈ కార్యక్రమంలో ఏపీయూడబ్ల్యూజే అధ్యక్షుడు చావా రవి, సామ్నా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సిహెచ్ రమణారెడ్డి, శివరామకృష్ణ తదితరులు రక్తదానం చేశారు.

ప్రెస్ క్లబ్ కార్యదర్శి దాసరి నాగరాజు, ఏపీ ఫోటో జర్నలిస్ట్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు సీహెచ్ విజయభాస్కర్, ఐజేయూ నేషనల్ కౌన్సిల్ సభ్యుడు షేక్ బాబు తదితరులు పాల్గొన్నారు.

వార్తా రచనలో స్వీయ నియంత్రణ అవసరం

జాతీయ పత్రికా దినోత్సవం సందర్భంగా మీడియా అకాడమీ, నాగార్జున యూనివర్సిటీ సంయుక్తంగా నిర్వహిస్తున్న జర్నలిజం డిప్లొమా కోర్సు విద్యార్థులను ఉద్దేశించి ఆలపాటి సురేశ్ కుమార్ వర్చువల్ తరగతుల ద్వారా ప్రసంగించారు.

స్వతంత్ర భారతదేశంలో ప్రజల గొంతుకగా మీడియా వ్యవహరించాలన్నదే పత్రికా స్వేచ్ఛ ప్రధాన ఉద్దేశమని అన్నారు.

ప్రజా శ్రేయస్సును దృష్టిలో ఉంచుకుని వార్తలు రాయడం ద్వారా మీడియా స్వీయ నియంత్రణ సాధ్యమవుతుందని పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో కోర్సు డైరెక్టర్ ప్రొఫెసర్ బాబీ వర్ధన్ తదితరులు పాల్గొన్నారు.