
అమరావతి : బంగాళాఖాతంలో నెలకొన్న ప్రతికూల పరిస్థితుల నేపథ్యంలో రాష్ట్రానికి చెందిన మత్స్యకారుల భద్రతకు అత్యధిక ప్రాధాన్యం ఇస్తున్నామని మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు తెలిపారు. ఒడిశా మత్స్యశాఖ అధికారులతో సమన్వయం చేసుకుంటూ చేపల వేట పడవలకు ఆశ్రయం కల్పించేందుకు చర్యలు చేపట్టినట్లు వెల్లడించారు. పరిస్థితులు అనుకూలించి, మత్స్యకారులు తమ ప్రాంతాలకు క్షేమంగా తిరిగివచ్చే వరకు తీరప్రాంత జిల్లాల మత్స్యశాఖ అధికారులు నిరంతరం పర్యవేక్షించాలని ఆదేశించారు.
గోపాల్ పూర్ పోర్టులోకి అనుమతి:
ఒడిశా అధికారుల నుంచి అందిన సమాచారం ప్రకారం ఆంధ్రప్రదేశ్‌కు చెందిన 51 యాంత్రిక పడవలను గోపాల్పూర్ పోర్టులోకి అనుమతించినట్లు మంత్రి వివరించారు. వీటిలో ఇంజిన్ పనిచేయకుండా నిలిచిపోయిన ఒక పడవను లాగి తీసుకువచ్చి, పోర్టులో సురక్షితంగా లంగరు వేసినట్లు తెలిపారు. అరయపల్లి ఫిష్ ల్యాండింగ్ సెంటర్‌కు మరో 16 పడవలు క్షేమంగా చేరుకున్నాయని పేర్కొన్నారు. పడవలను గోపాల్పూర్ పోర్టులోకి అనుమతించేందుకు ఒడిశా మత్స్యశాఖ అక్కడి కలెక్టర్, పోర్టు అధికారులకు సమాచారం అందించి సమన్వయం చేసిందని వివరించారు. మత్స్యశాఖ కమీషనర్, అధికారులు నివేదించిన రెండు పడవలతోపాటు వాటిలోని సిబ్బంది కూడా గోపాల్‌పూర్‌లో సురక్షితంగా ఉన్నారని మంత్రి తెలిపారు. సంబంధిత కుటుంబాలను సంప్రదించి ఈ సమాచారాన్ని తెలియజేసినట్లు పేర్కొన్నారు.
భరోసా కల్పించాలని ఆదేశం:
మత్స్యకారుల క్షేమ సమాచారాన్ని కుటుంబాలకు ఎప్పటికప్పుడు చేరవేసి, వారికి భరోసా కల్పించాలని అధికారులకు సూచించారు. పడవల యజమానులతో క్రమం తప్పకుండా సంప్రదింపులు జరపాలి. ప్రతి పడవ పరిస్థితిని తెలుసుకుంటూ అవసరమైన సహాయానికి సంబంధిత అధికారులతో సమన్వయం చేసుకోవాలి. సముద్రంలో ప్రతికూల పరిస్థితులు తొలగిన తర్వాతే ఆయా పడవలు తమకు సంబంధించిన ఫిషింగ్ హార్బర్లు, ఫిష్ ల్యాండింగ్ సెంటర్లకు క్షేమంగా చేరుకునేలా పర్యవేక్షించాలి అని మంత్రి స్పష్టం చేశారు. మత్స్యకారుల ప్రాణ రక్షణే ప్రభుత్వ ప్రథమ ప్రాధాన్యమని అచ్చెన్నాయుడు పేర్కొన్నారు. తీరప్రాంత జిల్లాల అధికారులు అప్రమత్తంగా వ్యవహరిస్తూ, క్షేత్రస్థాయి సమాచారానికి అనుగుణంగా తక్షణ చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.