
అమరావతి : ప్రపంచ హార్ట్ దినోత్సవం ( World Heart Day 2026 ) సందర్భంగా ఈ నెల 29 వ తేదీన కర్నూలులోని ఎ-క్యాంప్‌లో ఉన్న కర్నూల్ హెల్త్ క్లబ్లో ప్రత్యేక అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమానికి సంబంధించిన అధికారిక ప్రచార పోస్టర్‌ను గురువారం విజయవాడలోని చీఫ్ సెక్రటరీ క్యాంపు కార్యాలయంలో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, కర్నూల్ హార్ట్ ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు జి. సాయి ప్రసాద్, కర్నూల్ హార్ట్ ఫౌండేషన్ కార్యదర్శి, ప్రముఖ కార్డియాలజిస్ట్, డాక్టర్ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ డాక్టర్ పి. చంద్రశేఖర్,రిజిస్ట్రార్ టి. సాయి సుధీర్ ల తో కలిసి ఆవిష్కరించారు.రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, కర్నూల్ హార్ట్ ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు జి. సాయి ప్రసాద్ మాట్లాడుతూ మారుతున్న ఆధునిక జీవనశైలి, పెరుగుతున్న పని ఒత్తిడి తదితర కారణాలతో గుండె సంబంధిత సమస్యలపై ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందన్నారు. గుండె ఆరోగ్యంపై ప్రజల్లో అవగాహన పెంపొందించడమే ప్రపంచ హృదయ దినోత్సవం ప్రధాన ఉద్దేశ్యమని తెలిపారు.
“డోంట్ మిస్ ఎ బీట్” నినాదంతో :
ఈ ఏడాది “డోంట్ మిస్ ఎ బీట్” (Don’t Miss a Beat) అనే నినాదంతో గుండె ఆరోగ్యంపై ప్రజల్లో విస్తృత చైతన్యం తీసుకురావాల్సిన అవసరం ఉందన్నారు. గుండె పనితీరుపై అవగాహన కలిగి ఉండటంతో పాటు, గుండెపోటుకు సంబంధించిన ముందస్తు హెచ్చరిక సంకేతాలను గుర్తించడం ఎంతో ముఖ్యమని సూచించారు. కర్నూల్ హార్ట్ ఫౌండేషన్ 2002 సెప్టెంబర్ లో కర్నూలులో స్థాపించబడింది. అప్పటి కర్నూల్ జిల్లా కలెక్టర్ జి. సాయి ప్రసాద్ వ్యవస్థాపక అధ్యక్షులుగా, వ్యవస్థాపక కార్యదర్శిగా డాక్టర్ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ డాక్టర్ పి. చంద్రశేఖర్ లు ఉన్నారు. ఈ నెల 29వ తేదీ మంగళవారం సాయంత్రం 6.00 గంటలకు కర్నూలు ఎ-క్యాంప్‌లోని కర్నూల్ హెల్త్ క్లబ్లో ప్రపంచ హృదయ కార్యక్రమం నిర్వహించనున్నట్లు కర్నూల్ హార్ట్ ఫౌండేషన్ ప్రతినిధులు తెలిపారు.