షైనింగ్ ఆంధ్రా- అచీవింగ్ ఆంధ్రా:శివరాజ్ సింగ్ చౌహాన్

తెనాలి : గుంటూరు జిల్లా బుర్రిపాలెం లో జరిగిన పేదలకు పట్టాభిషేకం కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి శివరాజ్‌సింగ్‌ చౌహాన్‌ ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు.

విజనరీ నేత చంద్రబాబు నేతృత్వంలో ఏపీ ఇక షైనింగ్ ఆంధ్రా, అడ్వాన్స్డ్ ఆంధ్రా, అచీవింగ్ ఆంధ్రాగా మారుతోందని కొనియాడారు. పేదల సొంతింటి కలను నెరవేర్చాలన్న చంద్రబాబు సంకల్ప బలం గొప్పదని ప్రశంసించారు.

3డీ కాంక్రీట్‌ ప్రింటింగ్‌ సాంకేతికతతో ఏపీలో చేపడుతున్న గృహ నిర్మాణం దేశానికే రోల్‌ మోడల్‌గా నిలుస్తుందని పేర్కొన్నారు. ప్రస్తుతం చేపట్టిన 3 లక్షల ఇళ్ల నిర్మాణం పూర్తయ్యేలోగానే మరో 3 లక్షల ఇళ్లకు శాంక్షన్‌ ఇస్తామని, ఆ తర్వాత మరో 3 లక్షల ఇళ్లను కూడా ఏపీకి మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు.

ప్రధాని మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం ఏపీ అభివృద్ధికి పూర్తి సహకారం అందిస్తుందని తెలిపారు. రైతుల కోసం కేంద్రంతో కలిసి ఏపీ సీఎం అన్నదాత సుఖీభవ కింద రూ.20వేల ఆర్ధిక సహకారం అందిస్తున్నారని అన్నారు.

ఏపీలోని అక్కచెల్లెళ్లు, అన్నదమ్ములు మొత్తం సుఖీభవ అనే విధానంలో ఏపీలో కూటమి ప్రభుత్వం పనిచేస్తోందని శివరాజ్ సింగ్ చౌహాన్ వ్యాఖ్యానించారు.

వీబీజీ రామ్ జీ పథకంతో పల్లె పండుగ కార్యక్రమం ద్వారా గ్రామాల్లో డ్రెయిన్లు, రోడ్లు సహా వివిధ మౌలిక సదుపాయాల కల్పనకు కేంద్రం సహకారం అందిస్తుందన్నారు.

ఏపీని 360 డిగ్రీల కోణంలో సీఎం చంద్రబాబు, ప్రధాని మోదీ అభివృద్ధి చేస్తున్నారన్నారు.

త్రీడి ప్రింటింగ్ టెక్నాలజీ పరిశీలన

అంతకుముందు కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్, సీఎం చంద్రబాబు త్రీడీ ప్రింటింగ్ టెక్నాలజీ ద్వారా చేపట్టిన గృహ నిర్మాణ ప్రాజెక్టును సందర్శించారు.

సీబీఆర్ఐ అధికారులు వారికి త్రీడీ టెక్నాలజీ నిర్మాణ ప్రక్రియ గురించి వివరించారు. కేవలం 10 రోజుల్లో ఒక ఇంటిని ఈ సాంకేతికతో నిర్మించే అవకాశముందని తెలిపారు.

అనంతరం ఇరువురు నేతలూ ఓ లబ్దిదారు కుటుంబానికి చెందిన ఇంటి నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. భూమి పూజ చేసిన అనంతరం లబ్దిదారు కుటుంబంతో ఆప్యాయంగా మాట్లాడి వారికి నూతన వస్త్రాలను బహూకరించారు.

అనంతరం 3 లక్షల ఇళ్ల నిర్మాణానికి సూచికగా శిలాఫలకం ఆవిష్కరించి అక్కడికి సమీపంలోనే మొక్కలు నాటారు.

ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్‌, మంత్రులు కొలుసు పార్థసారథి, నాదెండ్ల మనోహర్‌, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్‌ మాధవ్‌, ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.

అనంతరం వేదికపై లక్ష్మీ అనే మహిళకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ఇంటి పట్టాన అందించారు.