
అమరావతి : బీసీల అభ్యున్నతి, సంక్షేమం తెలుగుదేశం పార్టీతోనే సాధ్యమని గౌరవ ప్రత్తిపాడు నియోజకవర్గ శాసనసభ్యులు డా.బూర్ల రామాంజనేయులు అన్నారు.
సోమవారం మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. బీసీల పట్ల గొడ్డలి పార్టీ అధినేత జగన్మోహన్రెడ్డి, ఆ పార్టీ నాయకులు విషం చిమ్ముతున్నారని విమర్శించారు.
రాష్ట్ర జనాభాలో 50 శాతానికి పైగా ఉన్న బీసీలు కులవృత్తులు, స్వశక్తితో గ్రామీణ వ్యవస్థకు వెన్నెముకగా నిలుస్తున్నారని, వారి అభివృద్ధిని అడ్డుకోవడం సరికాదన్నారు.
బీసీల అభివృద్ధికి టీడీపీ ఆవిర్భావం నుంచి కృషి చేస్తోందని రామాంజనేయులు తెలిపారు. 1979లో మండల కమిషన్ ఏర్పాటు కాగా, దాని సిఫారసులను అమలు చేయడంలో ఎన్టీ రామారావు కీలకంగా వ్యవహరించారని గుర్తుచేశారు.
1983 నుంచి మండల కమిషన్ సిఫారసుల అమలుకు ఎన్టీఆర్ చర్యలు చేపట్టారన్నారు. 1993లో ఏర్పాటైన జాతీయ బీసీ కమిషన్‌కు రాజ్యాంగబద్ధమైన అధికారాలు కల్పించేందుకు సీఎం చంద్రబాబు కేంద్రంతో చర్చలు జరిపి ఒత్తిడి తీసుకువచ్చారని చెప్పారు.
2015లో బీసీలకు ప్రత్యేక సబ్‌ప్లాన్ తీసుకువచ్చి సుమారు రూ.40 వేల కోట్లు ఖర్చు చేసి 30 పథకాలు అమలు చేశామని రామాంజనేయులు తెలిపారు.
విదేశీ విద్య, బెస్ట్ అవైలబుల్ స్కూల్స్, కోచింగ్ సెంటర్లు, ఫీజు రీయింబర్స్మెంట్ వంటి పథకాలు బీసీ విద్యార్థులకు ఉపయోగపడ్డాయని అన్నారు.
ఎన్టీఆర్ స్థానిక సంస్థల్లో బీసీలకు 20 శాతం రిజర్వేషన్లు కల్పిస్తే, చంద్రబాబు దానిని 34 శాతానికి పెంచారని పేర్కొన్నారు.
గత వైసీపీ ప్రభుత్వం బీసీ రిజర్వేషన్లను 24 శాతానికి తగ్గించిందని ఆయన ఆరోపించారు. ఆ నిర్ణయంపై సుప్రీంకోర్టును ఆశ్రయించడంలో వైసీపీ ప్రభుత్వం విఫలమైందన్నారు.
ప్రస్తుతం చంద్రబాబు ప్రభుత్వం బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు కల్పించేందుకు అసెంబ్లీ, శాసనమండలిలో చర్చించి తీర్మానాలు చేసిందని, జీవోలు జారీ చేసి అమలు దిశగా చర్యలు చేపట్టిందని తెలిపారు.
రాజ్యాంగ పరిమితుల నేపథ్యంలో హైకోర్టు ఉత్తర్వులు వచ్చినప్పటికీ వాటిని సవాల్ చేస్తూ సుప్రీంకోర్టును ఆశ్రయించిన ఘనత చంద్రబాబు ప్రభుత్వానిదేనన్నారు.
బీసీలకు 34 శాతం రిజర్వేషన్లపై వైసీపీకి చిత్తశుద్ధి ఉంటే సుప్రీంకోర్టులో తమతో కలిసి ఎందుకు పోరాడటం లేదని రామాంజనేయులు ప్రశ్నించారు.
బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు సమంజసమని భావిస్తే వైసీపీ కూడా సుప్రీంకోర్టులో పిటిషన్ వేయాలని, ఇంప్లీడ్ కావాలని సవాల్ చేశారు. కూటమి ప్రభుత్వం బీసీల సంక్షేమం కోసం అనేక చర్యలు చేపడుతోందని తెలిపారు.
గీత కార్మికులకు ఎక్సైజ్ షాపుల్లో 10 శాతం అవకాశం కల్పించామని, వడ్డెరలకు మైనింగ్ లీజుల్లో రిజర్వేషన్లు ఇచ్చామని చెప్పారు.
నాయి బ్రాహ్మణుల వేతనాన్ని రూ.15 వేల నుంచి రూ.25 వేలకు పెంచామని, మత్స్యకారులకు వేట నిషేధ సమయంలో రూ.20 వేల భృతి అందిస్తున్నామని తెలిపారు.
నేతన్నలకు రూ.25 వేల ఆర్థిక సహాయం అందించడంతో పాటు చేనేతలకు 200 యూనిట్లు, పవర్లూమ్లకు 500 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అందిస్తున్నామని చెప్పారు.
బీసీల హక్కులకు రక్షణ కల్పించేందుకు ప్రత్యేక చట్టాన్ని తీసుకువచ్చిన ఘనత కూడా చంద్రబాబుకే దక్కుతుందని రామాంజనేయులు అన్నారు.
వైసీపీ పాలనలో బీసీ పథకాలు రద్దు చేశారని, బీసీ సబ్‌ప్లాన్ నిధులు దారి మళ్లించారని ఆరోపించారు. టీడీపీకి మద్దతుగా నిలిచారనే కారణంతో బీసీ వర్గాలకు చెందిన పలువురు కార్యకర్తలపై దాడులు జరిగాయని, పల్నాడులో చంద్రయ్య, ప్రొద్దుటూరులో నందం సుబ్బయ్య, రేపల్లెలో అమర్నాథ్ గౌడ్ ఘటనలను ఆయన ప్రస్తావించారు. వైసీపీ పాలనలో సుమారు 300 మంది బీసీలు ప్రాణాలు కోల్పోయారని ఆరోపించారు.
కూటమి ప్రభుత్వం బీసీల అవసరాలకు అనుగుణంగా కొత్త పథకాలను అమలు చేస్తోందని ఎమ్మెల్యే తెలిపారు. ఆదరణ వంటి పథకాలతో బీసీ వృత్తిదారులకు అండగా నిలుస్తున్నామన్నారు.
ఇళ్ల నిర్మాణంలో బీసీలకు అదనంగా రూ.50 వేల సహాయం అందిస్తున్నామని, భవిష్యత్తులో నిర్మించే ఇళ్లలోనూ బీసీలకు ప్రాధాన్యత ఇస్తామని చెప్పారు. ఇళ్లపై సౌర విద్యుత్ వ్యవస్థ ఏర్పాటు చేసుకునే వారికి సబ్సిడీ అందిస్తున్నామని తెలిపారు.